రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లు | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లు

Published Fri, Feb 19 2016 3:50 AM

రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లు

మంజూరు చేసిన కేంద్రం
45 పట్టణాలు, నగరాలు ఎంపిక
ఇళ్ల నిర్మాణానికి రూ. 342 కోట్ల మేర ఆర్థిక సాయం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ తెలంగాణ రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లను మంజూరు చేసింది. తెలంగాణలోని 45 పట్టణాలు, నగరాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)లో భాగంగా అఫర్డబుల్ హౌజింగ్ ఇన్ పార్ట్‌నర్‌షిప్ (ఏహెచ్‌పీ)’ విధానంలో నిర్మించనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మొత్తం రూ. 1,397 కోట్లు ఖర్చుకానుండగా ఇందులో కేంద్రం రూ. 342 కోట్లను (ఒక్కో ఇంటికి రూ. లక్షన్నర చొప్పున) ఆర్థిక సాయంగా అందించనుంది. తెలంగాణ గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దానకిశోర్ గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలను వివరించారు.

ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సమకూరుస్తుందని, కేంద్రం వాటా పోను మిగిలిన నిర్మాణ వ్యయం కూడా భరిస్తుందని వివరించారు. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 7 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరం ఉందని, ఇతర నగరాలు, పట్టణాల్లో దాదాపు 6 లక్షల ఇళ్ల నిర్మాణం అవసర మవుతుందని వివరించారు. తొలుత తెలంగాణకు కేవలం 10,290 ఇళ్లు మాత్రమే కేటాయించారన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని ఇళ్లను మంజూరు చేయడంతోపాటు పథకాన్ని మరిన్ని పట్టణాలకు వర్తింపజేయాలని కోరుతూ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ...కేంద్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

దీనిపై స్పందించిన కేంద్రం డిసెంబర్ 21న రాష్ట్రానికి దాదాపు 47 వేల ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంమీద తొలి రెండు విడతల్లో తెలంగాణకు 57,664 ఇళ్లను మంజూరు చేసింది. తాజాగా వీటికితోడుగా మరో 22,817 ఇళ్లు మంజూరవడంతో ఇళ్ల సంఖ్య 80,481కు చేరుకోగా ఆర్థిక సాయం రూ. 1,207 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా ఇళ్లు మంజూరైన 45 నగరాలు/పట్టణాల జాబితాలో హైదరాబాద్ (1,585 ఇళ్లు), కామారెడ్డి (1,367), నిజామాబాద్ (1,367), ఖమ్మం (1,352), గజ్వేల్ (1,033), వరంగల్ (1,008 ఇళ్లు) ఉన్నాయి.

Advertisement
Advertisement