తెలంగాణ ఊటీగా అనంతగిరి.. | Anantagiri as Ooty of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఊటీగా అనంతగిరి..

Nov 14 2019 3:45 AM | Updated on Nov 14 2019 10:06 AM

Anantagiri as Ooty of Telangana - Sakshi

అనంతగిరిలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి

వికారాబాద్‌ అర్బన్‌: అనంతగిరిని తెలంగాణ ఊటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రి సబితారెడ్డి అనంతగిరి గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్పందించిన సీఎం.. ఈ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారని, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారని పేర్కొన్నారు.

అనంతగిరిని హాస్పిటల్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, అడ్వెంచర్‌ టూరిజంలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వివరించారు. అధికారులంతా టీం వర్క్‌ చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. తాము మరోసారి సమావేశమై చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణలోనే అనంతగిరిని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని వివరాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నామని తెలిపారు. 10–15 రోజుల్లో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే అందరం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement