మొక్కజొన్న గజగజ 

Agriculture Department report to State Govt - Sakshi

  17 జిల్లాల్లో ‘కత్తెర’ పురుగు విధ్వంసకాండ

  12 జిల్లాల్లో పత్తిని నాశనం చేస్తున్న గులాబీ పురుగు

  సర్కారుకు వ్యవసాయశాఖ నివేదిక

  కోటి ఎకరాలకు మించిన ఖరీఫ్‌ సాగు

  పంట నష్టంపై కేంద్రానికి విన్నవించడంలో విఫలం 

సాక్షి, హైదరాబాద్‌: మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. మొదట్లో సిద్దిపేట, మెదక్‌ జిల్లాలకే పరిమితమైన కత్తెర పురుగు (ఫాల్‌ ఆర్మీ వార్మ్‌) ఆ తర్వాత గత వారంలో 8 జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 17 జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, గద్వాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగాం, మహబూబాబాద్, వికారాబాద్‌ జిల్లాల్లోని మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నివేదిక తెలిపింది. అలాగే పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి విస్తరించింది. గత వారం వ్యవసాయ శాఖ వర్గాల లెక్కల ప్రకారం మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోనే కనిపించిన గులాబీరంగు పురుగు, ఇప్పుడు ఏకంగా మరో 12 జిల్లాలకు విస్తరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపించింది. మొక్కజొన్నపై కత్తెర, పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తున్నా చర్యలు చేపట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైంది.
 
కోటి ఎకరాల్లో పంటల సాగు...  

ఖరీఫ్‌ సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికి 1.01 కోట్ల ఎకరాలకు అంటే 93 శాతానికి చేరింది. అందులో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 44.71 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్‌ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 49.06 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.91 లక్షల(94%) ఎకరాల్లో సాగయ్యాయి. ఆహార పంటల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.11 లక్షల (102%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు సాధారణం కంటే గణనీయంగా పుంజుకున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.48 లక్షల (86%) ఎకరాల్లో సాగైంది. కంది 97%, పెసర 72% సాగయ్యాయి. 

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఏదీ?  
ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనేక జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవిగాక పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉన్నా వ్యవసాయశాఖ కేవలం ప్రాథమిక నివేదిక వరకే పరిమితమైంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపించలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కనీసం ప్రాథమిక నివేదిక కూడా తమకు చేరలేదని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది.

12 జిల్లాల్లో లోటు వర్షపాతం 
ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 614.5 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 584.1 ఎంఎంలు నమోదైంది. జూన్‌ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఈ ఐదు రోజుల్లో 74 శాతం లోటు నమోదైంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ ఇప్పటికీ 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, నాగర్‌కర్నూలు, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో లోటు నమోదైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top