
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లలో 41, రామగుండం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ 38, 39 డిగ్రీల వరకూ నమోదయ్యాయి.
మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండాకాలంలో ఇలా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం సహజమని, దీంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.