పిల్లలమర్రికి పునర్జన్మ!

 800 Year Old Banyan Tree In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: పిల్లలమర్రికి పునర్జన్మ!  పిల్లలమర్రికి ప్రాణమొచ్చింది. ఏడాది క్రితం వరకు ఎండిన ఆకులు.. విరిగిపడ్డ ఊడలతో కళావిహీనంగా కనిపించిన 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ చెట్టు మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయిన పిల్లలమర్రి నేడు 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ చూడముచ్చటగా దర్శనమిస్తోంది. మరో ఏడాదిలోగా పూర్తి పూర్వస్థితికి తిరిగి రానుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల ఈ మర్రి చెట్టు.. శాఖోపశాఖలుగా 4 ఎకరాల్లో విస్తరించింది. కానీ నిర్వహణ లోపించడంతో పూర్తిగా ఎండిపోయిన రెండు ఊడలు, ఒక చెట్టు భాగం 2017 డిసెంబర్‌ 16న రాత్రి భారీ శబ్దంతో విరిగిపడ్డాయి. దీంతో అదే నెల 20న పిల్లలమర్రి ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసేశారు. మిగతా చెట్టు పరిరక్షణలో భాగంగా ఊడలు కిందికి పడకుండా వాటికి సహాయంగా రూ.3.80 లక్షలతో 36 పిల్లర్లు నిరి్మంచారు. 

చచ్చిపోతున్నన చెట్టును బతికించేందుకు సెలైన్‌ బాటిళ్లతో ప్రాణం పోసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక బాటిల్‌ నీళ్లలో 20 మి.లీ.ల క్లోరోపైరిపస్‌ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్‌ నీళ్లలో 5 మి.లీ. క్లోరోపైరిపస్‌ మందు ను కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్‌ఫాస్ఫేట్‌ను చల్లుతున్నారు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి చెట్లు.. ఊడలకు అందిం చారు. చెట్టు చుట్టుపక్కల 300 ట్రాక్టర్ల ఎర్రమట్టి పోయించారు. దీని పునరుజ్జీవం కోసం ఇప్పటి వరకు అధికారులు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. పిల్లలమర్రి ఆవరణలో పర్యాటకులు వెళ్లకుండా గేటు ఎదుట ఒకవైపు చెట్టును చూసుకుంటూ మరోవైపు దిగేలా ఏడాది క్రితం రూ.4 లక్షలతో కెనోపివాక్‌ బ్రిడ్జిను ఏర్పాటుచేశారు.  దీంతో పిల్లలమర్రి పూర్వస్థితికి వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top