కేరళకు 500 టన్నుల బియ్యం 

500 tonnes rice for Kerala from Telangana Govt - Sakshi

వెంటనే పంపాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశం 

ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉండాలని పిలుపు 

రూ.25 కోట్లు పంపినందుకు కేరళ సీఎం కృతజ్ఞతలు 

సాక్షి, హైదరాబాద్‌: వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు వెంటనే 500 టన్నుల బియ్యం పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేసేందుకు బియ్యం పంపాలని కేరళ నుంచి విజ్ఞప్తి వచ్చిన వెంటనే కేసీఆర్‌ స్పందించారు. రూ.25 కోట్ల నగదుతో పాటు నీటిశుద్ధి (ఆర్‌వో) యంత్రాలను, పౌష్టికాహారాన్ని పంపినందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌ సీఎం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. విజయన్‌ ఈ మేరకు కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు. కేరళ అధికారులు కూడా తెలంగాణ అధికారులతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. కేరళకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌తో కేసీఆర్‌ మాట్లాడారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ అధికారులు కేరళకు రూ.కోటి విలువైన 500 టన్నుల బియ్యం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఐఏఎస్‌ అధికారుల విరాళం 
ప్రకృతి విపత్తు ధాటికి అతలాకుతలమైన కేరళకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు ఒక రోజు వేతనానికి తక్కువ కాకుండా కేరళకు వితరణ ఇవ్వాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి ఈ మొత్తాన్ని పంపాలని నిర్ణయించారు. కేరళ ప్రజల సహాయ, పునరావాస పనుల్లో తమ వంతుగా సాయం చేయాలని తీర్మానించినట్లు ఐఏఎస్‌ అధికారుల సంఘం గౌరవ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. 

టీజీవోల వితరణ రూ.10 కోట్లు 
కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగులు ఒక్కరోజు జీతాన్ని ప్రకటించారు. టీజీవో గౌరవ చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, టీజీవో నేతలు సత్యనారాయణ, ఎంబీ కృష్ణయాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌గుప్తా తదితరులు ఈ మేరకు దాదాపు రూ.10 కోట్ల చెక్కును సీఎస్‌ ఎస్‌కే జోషికి అందజేశారు. ప్రకృతి విపత్తు సమయాల్లో తెలంగాణ ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారని మమత పేర్కొన్నారు.  

ఐపీఎస్‌ల ఒకరోజు వేతన విరాళం 
కేరళ వరద బాధితులకు రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారులంతా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అధికారుల సంఘం కార్యదర్శి, నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ శాఖలో 97మంది అధికారులు పనిచేస్తున్నారని, వారి ఒకరోజు వేతనం సుమారు రూ.10లక్షల వరకు ఉంటుందని  పేర్కొన్నారు. ఈ విరాళం మొత్తం ప్రభుత్వం ద్వారా కేరళ రాష్ట్ర రిలీఫ్‌ ఫండ్‌కు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.   

‘రెవెన్యూ’ సాయం 
రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది కేరళ ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సాయాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. తహసీల్దార్‌ నుంచి ఆఫీస్‌ సబార్డినేట్‌ వరకు రాష్ట్రంలో పనిచేస్తున్న అందరు రెవెన్యూ సిబ్బంది తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒకరోజు వేతనాన్ని ప్రకటించారు. దీంతో రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు ఒకరోజు వేతనంగా వచ్చే దాదాపు రూ.1.5కోట్లు కేరళకు విరాళంగా అందనుంది.

అండగా తెలంగాణ కాంగ్రెస్‌ 
ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల నెల రోజుల వేతనాన్ని కేరళకు విరాళంగా ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల వేతనాన్ని కేరళ సహాయ నిధి కోసం రాజీవ్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌కు పంపుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో వెల్లడించారు. జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు తలా లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top