15 ఎకరాల్లో అడ్వొకేట్స్‌ అకాడమీ 

15 Acres Of Land For Construction Of An Advocate's Academy - Sakshi

జనవరిలోగా ఖాళీల భర్తీ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

కమాన్‌చౌరస్తా (కరీంనగర్‌):  హైదరాబాద్‌ సమీపంలోని షామీర్‌పేట, నల్సార్‌ లా యూనివర్సిటీ సమీపంలో 15 ఎకరాల్లో అడ్వొకేట్స్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. కరీంనగర్‌ కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈ–ఫైలింగ్‌ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చల్లా కోదండరాం, జస్టిస్‌ పి.నవీన్‌రావుతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌ మాట్లాడారు. జనవరిలోగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

బార్‌ అసోసియేషన్లు కూడా న్యాయవాదుల కోసం వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.  కరీంనగర్‌ పోర్ట్‌ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. మరో న్యాయమూర్తి పి.నవీన్‌రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు ఆనందకరమని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నంది మేడారం పంప్‌హౌస్‌ సందర్శన  
ధర్మారం: రైతులకు ఎల్లకాలం సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం సంతోషకరమని జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ను శనివారం న్యాయమూర్తులు కోదండరాం, నవీన్‌రావు, కరీంనగర్‌ జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తితో కలసి సందర్శించారు. పంప్‌హౌస్‌లోని సర్జిఫూల్, మోటార్లు, విద్యుత్తు సబ్‌స్టేషన్‌లను పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ వివరించారు. అనంతరం మేడారంలోని హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. త్రికుటాలయం, నంది ఆలయాలను సందర్శించారు. న్యాయమూర్తి నవీన్‌రావు నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top