వడదెబ్బకు 12 మంది బలి | 12 died with sunstrok in telangana | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 12 మంది బలి

Mar 24 2016 4:20 AM | Updated on Sep 3 2017 8:24 PM

భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల కారణంగా వడదెబ్బ తగిలి రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు.

సాక్షి నెట్‌వర్క్: భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల కారణంగా వడదెబ్బ తగిలి రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యూలవాడకు చెందిన తుమ్మల నాగయ్య(55), తొర్రూరు మండలం వెలికట్ట శివారు పెద్దమాగ్యా తండాకు చెందిన జాటోలు జేతురాం(55), నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన నాతి పెద్దమ్మ(105) వడదెబ్బ బారినపడి మరణించారు. ఇదే జిల్లా మునగాల మండలం కలకోవకు చెందిన పనస శ్రీరాములు(60) మూడు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నార్కట్‌పల్లి మండలం బి.వెల్లంలకు చెందిన గొర్రెల కాపరి సోమనబోయిన చిన్న రాములు (70), ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌కు చెందిన జాకటి వెంకమ్మ (70), ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం భీమునిగూడానికి చెందిన కుర్సం భద్రయ్య(37), బయ్యూరం మండలం జగ్గుతండాకు చెందిన బానోత్ బద్రి(66), సత్తుపల్లికి చెందిన పూచి నాగరాజు(28), ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన షేక్ మదార్‌బీ(72) వడదెబ్బ కారణంగా మృతి చెందారు.  మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్‌కు చెందిన బోట్క బాల్‌లక్ష్మమ్మ (50) ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి, వడదెబ్బతో అక్కడే మరణించింది. కొత్తకోట మండలం మదనాపురంలో గుట్ట వద్ద రాళ్లు కొడుతూ జీవించే బక్కన్న (58) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై, మృతిచెందాడు.

Advertisement

పోల్

Advertisement