-
రాహుల్.. అదానీపై రేవంత్‌ను డిమాండ్ చేస్తారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో సెబీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదానీ దేశానికి తప్పు అయితే.. తెలంగాణకు ఎలా కరెక్ట్ అని ప్రశ్నించారు.కాగా, ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఆగస్టు 22న అదానీ-సెబీ బంధంపై హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చినందున కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చినందుకు సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండు విధాల ధోరణి అవలంబించటాన్ని మేము గమనిస్తున్నాం. Glad that the Congress had called for a nationwide protest in light of Hindenburg Report on Adani-SEBI nexus on Aug 22, but we at BRS see through their double standardsIf Adani is wrong for India, why and how is he right for Telangana? Will @RahulGandhi demand CM Revanth…— KTR (@KTRBRS) August 13, 2024 అదానీ భారతదేశానికి తప్పు అయితే, తెలంగాణకు ఎందుకు, ఎలా సరైనది?. అదానీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారా?. ఇది కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కానీ.. నమ్మకం గురించి కాదా?. తెలంగాణ భవిష్యత్‌కు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. మరి కాంగ్రెస్ నిలుస్తుందా? అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు పేరు రావొద్దని ప్రాజెక్టుల పేర్లు మార్చి..: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకురూ. 7,436 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు.‘సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాంలో రాజీవ్ సాగర్, ఇంధిరా సాగర్ల నిర్మాణం చేపట్టాం. కానీ కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, రాజీవ్, ఇంధిరా సాగర్లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బీఆర్ఎస్ నామకరణం చేసింది. రాజీవ్, ఇంధిరా సాగర్లు రూ. 3500 కోట్ల తో పూర్తయ్యేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రూ. 18 వేల కోట్లకు పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, ఆయకట్టు పెరగలేదు. రాజీవ్ ,ఇంధిరా సాగర్ లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది. 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ పాలనలో కేవలం 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ పర్మిషన్ మేమే తీసుకొచ్చామని హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఇంతవరకు సిడబ్ల్యుసి పర్మిషన్ రాలేదు. రాజీవ్, ఇంధిరా సాగర్లను మార్చి సితారామ ప్రాజెక్టు చేపట్టడమే తప్పుడు నిర్ణయం’ అని మంత్రి మండిపడ్డారు. -
ఉప ఎన్నిక ఖాయం.. సీనియర్ నేతకు ఓటమే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం సరికాదన్నారు. ఇదే సమయంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, బాన్సువాడ బీఆర్ఎస్ నేతలు మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసం కలిశారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు. సీనియర్ నాయకుడు అని పోచారంను బీఆర్ఎస్ ఎంతో గౌరవం ఇచ్చింది. అన్ని రకాలుగా గౌరవించినా పార్టీని వీడటం ఆయనకే నష్టం.కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించింది. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లు అయినా సరే వదిలి పెట్టేది లేదు. వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నో అవమానాలు.. మంత్రి తుమ్మల కంటతడి
సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్‌తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్మెంట్ జూలూరుపాడుకి మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు. -
అప్పుడు కలెక్షన్ కౌంటర్లు..ఇప్పుడు కాల్‌సెంటర్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు. రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్ఎస్ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్ఎస్ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు. -
పరాన్నజీవుల్లా మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారుడుతనంతో పరాన్నజీవుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులకు పేరు వస్తుందనే భయంతోనే... క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఈ నెల 15న సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఖమ్మంజిల్లా నేతలతో కలిసి సోమవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టులో కాంగ్రెస్ కేసులు వేసినా, బీఆర్ఎస్ అనేక కష్టాలను అధిగమించి పనులు పూర్తి చేసిందన్నారు. కానీ రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం రావడంతో ప్రాజెక్టు తాము కట్టినట్టుగా కాంగ్రెస్ నేతలు కటింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఏళ్లకేళ్లు పట్టే ప్రాజెక్టు డిజైన్, భూసేకరణ, అనుమతులు తదితరాలన్నీ ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాడు కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టా రని, గతంలో కేసీఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన మంత్రి తుమ్మల.. ప్రస్తుతం మాట మార్చారని చెప్పారు.సత్యవాక్య పరిపాలకులు సీతారాముల పేరుపై కట్టిన ప్రాజెక్టుపై మంత్రులు అబద్ధాలు చెబితే భగవంతుడు కూడా క్షమించడన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున పండుగ నిర్వహిస్తామన్నారు. వాట్సాప్ హెల్ప్‌లైన్ దరఖాస్తుల పరిశీలన రుణమాఫీ అందని రైతుల కోసం తెలంగాణభవ న్లో ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అందిన దరఖాస్తులను హరీశ్ పరిశీలించారు. 83748 52619 నంబరుకు వాట్సాప్ ద్వారా 72వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. సునీతారావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కష్టపడిని వారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. గోషామహల్లో తనకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు.కాగా, సునీతా రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో జరగడం లేదు. అసెంబ్లీ టికెట్ వదులుకుంటే రూ.5కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడు. అయినా నేను వదులుకోలేదు. ఓడిపోయే గోషామహల్ టికెట్ నాకు ఇచ్చారు. నాకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. చివరకు బీజేపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇస్తానని చెప్పారు.. అయినా నేను పార్టీని వీడలేదు.ఇప్పుడు నన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగింది. పురుషులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కష్టపడ్డ వారిని పట్టించుకోలేదు. మేము చేపట్టిన కార్యక్రమాలకు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రాలేదు. దీపాదాస్ మాకు టైమ్ ఇవ్వలేదు. మా ఫోన్ ఆమె లిఫ్ట్ చేయట్లేదు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ పెద్దలని కూడా కలిశాను. నేను చేసిన తప్పు ఏంటి?. ఎన్నికల్లో పోటీ చేయడం నా తప్పా?.మహిళ కాంగ్రెస్‌ను నడిపించడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పార్టీలో కష్ట పడ్డవారికి కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే పోరాటం చేస్తాను. నేను అందరిని కలుపుకొనిపోయే వ్యక్తిని. అన్ని పదవులకు నేను అర్హురాలిని. మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత లేదని ఏఐసీసీ ఇంచార్జ్ గురదీప్ సింగ్ సపర్ చెప్పారు. ఏ పదవి ఇచ్చినా చేపట్టడానికి నేను సిద్ధం. త్వరలో 33% మహిళ రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్, అల్కా లాంబ మాట ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
కష్టపడింది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్‌ది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తూ.. కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టును తామే కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.కాగా, హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించింది కేసీఆర్. ఆయన నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ పార్టీనే నిర్మించినట్టు ఫుల్ కలరింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి.. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ను కట్టింది కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కట్టిందని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ హితవు పలికారు. -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
‘మాటలు కోటలు దాటుతున్నాయ్’..రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగుకు స్వర్ణయుగమని..కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలంగా మారిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విటర్ వేదికగా ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఎక్స్‌లో కేటీఆర్ ఏమన్నారంటేకేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్. తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే..ఢమాల్ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం..! దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..ఎనిమిది నెలల్లోనే..ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? సంతోషంగా సాగిన సాగులో..ఎందుకింత సంక్షోభం..?? మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్య పెట్టి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అంటూ కేటీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.రూ.500 బోనస్ అని..నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ..ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు..ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు..చెరువులకు మళ్లించే తెలివి లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో..రైతు బతుకుకు భరోసానే లేదు.బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..క్యూలైన్లో పాసుబుక్కులు, చెప్పులు..కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు అప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు..కౌలు రైతుల బలవన్మరణాలు ఇలా.. ఒకటా.. రెండా..సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష !!అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లోతగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద… pic.twitter.com/2iyQGw8RSP— KTR (@KTRBRS) August 12, 2024 -
కాళేశ్వరం కొట్టుకుని పోతే నీళ్లెలా వచ్చాయి?
సిద్దిపేటజోన్: కాళేశ్వరం కొట్టుకు పోయిందని రాద్దాంతం చేశారని, ఇప్పుడు నీళ్లు ఎలా వచ్చాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి సీఎం సహా యనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ బద్నాం చేసిందని, మరి ఇప్పుడు రంగనాయక సాగ ర్లోకి కాళేశ్వరం గోదారి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నేడు రంగనాయక సాగర్ నిండుకుండలా ఉందన్నారు. రెండు పంటలకు సరిపడేలా నీళ్లు ఉన్నా యని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు మూసివే స్తామని చెప్పి నేడు గల్లీ గల్లీలో పెట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని, గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు. -
రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలకు కట్టుబ డి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్టుగా వస్తున్న వార్తలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మంచిది కాదని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక..ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక ఇప్పటికే చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజ రాత్‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని, ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతుందంటే తెలంగాణ ఇమేజ్ ఏం అవుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడు లను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసా గించాలని సూచించారు. అమరరాజా సంస్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డ విష యాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. సెబీ, అదానీ బంధంపై విచారణ జరపాలి: కేటీఆర్‘అదానీతో సెబీ చీఫ్‌కు ఉన్న సంబంధం నిజంగా ఆందోళనకరం. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. ‘ఈ విషయంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశముంది. రాహుల్ గాంధీ గారూ.. తెలంగాణలో మీ సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నారు. అదానీ పాట పాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సమగ్రతను కూడా గంగలో కలుపుతున్నాడు. ఈ ద్వంద్వ విధానాలపై మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా’ అని కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. -
బీజేపీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోంది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీల్లో ఒక్కటైన రైతుభరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అలాగే, నిరుద్యోగులకు గాలికి వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, హరీష్ రావు సిద్దిపేటలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అంటూ గొప్పలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా రైతులను కాంగ్రెస్ సర్కార్ నిండా ముంచింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో వాటిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడిచింది. ఆగష్టు నెల వచ్చినా ఇంకా రైతుబంధు డబ్బులే రాలేదని అన్నారు. మరోవైపు, రైతు భరోసా ఊసే లేదని ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో నిరుద్యోగులను గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు అంటూ, జాబ్ క్యాలెండర్ అని ఎన్నో బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని అన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. -
గ్యారంటీలను అందిస్తాం.. పేదవారిని ఆదుకోవడమే మా లక్ష్యం: మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.కాగా, మంత్రి దామెదర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దయతోనే మాకు పదవులు వచ్చాయి. మా కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమంతో పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ప్రతీఏటా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం ద్వారా రూ.580 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోంది. అయినా పేదల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోంది.అవసరం ఉన్న చోట డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలోని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రికి మంజూరుకి అనుమతులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి పండుగను తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
బండి సంజయ్ సీఎం రేవంత్‌కు కోవర్టు: కేపీ వివేకానంద
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా మారారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ మాట్లాడాడు. ఢిల్లీలో కుస్తీ గల్లిలో దోస్తీ కాంగ్రెస్, బీజేపీ పని. ఈ రెండు పార్టీలకు చెరో 8 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఇచ్చారు.. ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు?. కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారు బండి సంజయ్. ఎందుకు కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలి?. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసిఆర్ అరెస్ట్ చేయాలా?. ఈ నెల రెండో తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సుంకిశాల ప్రమాదం చిన్నదిగా చూపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆ కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదు ప్రభుత్వం’అని అన్నారు.బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనను మా కేడర్ మరిచిపోదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది’ అని అన్నారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివా రం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతిని ధులతో సంజయ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడు తూ..’’బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌కు, బీజేపీకి సంబంధం ఏమిటి? ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ వస్తే... బీజేపీకి ఏమైనా సంబంధముందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకు బెయిల్ వస్తే బీజేపీయే ఇప్పించిందనే ప్రచారం చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకుందని సంచలన వ్యాఖ్య చేశారు. ’’కేసీఆర్ పాలనలో పోలీసులను ప్రయో గించి బయట మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు’’ అని పేర్కొన్నారు కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలైనయ్..‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనయ్. ఇత ర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదు. కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల అధికా రం ఇచ్చారు. ఆ అధికారాన్ని నిలుపుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంది’ అని బండి సంజయ్ అన్నారు. తమ్ముడి కోసమే రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదు.. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలి. అయితే సొంత వ్యవహారాల కోసమే విదేశాలకు అప్పుడు బీఆర్ఎస్ పెద్దలు వెళ్ళారు.. ఇప్పుడు రేవంత్ వెళ్ళారు. ఏమీ తేడా లేదు’ అని వ్యాఖ్యా నించారు.‘అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలి. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవా లు వెల్లడవు తాయి’ అని సంజయ్ చెప్పారు. ముచ్చర్ల చుట్టూ ఎన్ని భూములు కొట్టేశారో గానీ ప్రభుత్వం అక్కడ ఫోర్త్ సిటీ నిర్మిస్తామని చెబుతోందన్నారు. అమరావతి చుట్టుపక్కల చంద్రబాబు భూముల సంగతేమిటి అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నేను అమరావతి వెళ్ళలేదు.. అక్కడ చంద్రబాబు భూముల గురించి తెలియదు అని సంజయ్ బదులిచ్చారు.అందుకే హరీశ్ మంచి లీడర్ అన్నాను’’పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇప్పటికైనా చెప్ప డం శుభ పరిణామం. ఆ విషయం చెప్తున్నారు కాబట్టే.. హరీశ్ మంచి లీడర్ అన్నాను’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. -
త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు లోక్‌సభలో బీజేపీ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారని సెటైర్లు వేశారు.కాగా, కొండా విశ్వేశ్వర రెడ్డి శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు గత ఆరు నెలల్లో 35వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎంపీల సంఖ్యకు నిధులకు సంబంధం లేదు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మా ఐడియాలు కాపీ కొట్టారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బడ్జెట్ బాగా లేదని వాళ్ళే అంటున్నారు.. అంటే మీ ఐడియాలు బాగాలేవా?. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 12 లక్షల ముస్లీంలు ఉంటారు. వక్ఫ్ బోర్డుకు రూ.10 లక్షల ఎకరాల భూమి ఉంది. వక్ఫ్ బోర్డు భూముల ద్వారా ఇప్పుడు కేవలం 190 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వక్ఫ్ బోర్డు ఇష్యూపై జేపీసీ వేశారు. కమిటీలో డీకే అరుణ, ఎంపీ అసద్ ఉన్నారు. వచ్చే సెషన్లో వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పొందవచ్చు. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలకు లాభం జరుగుతోంది.జుంటుపల్లి ప్రాజెక్టు గేట్లు ఐదేళ్లుగా పనిచేయడం లేదు. తక్కువ ఖర్చుతో జంటుపల్లి ప్రాజెక్టు గేట్లను ప్రభుత్వం మరమ్మతు చేయించింది. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం, నిర్వాహణ చేయాలి. మూసీ ప్రాజెక్టు మంచిదే.. కానీ ప్రయార్టీ కాదు. త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తాను. జంట జలాశయాలపైన ఇప్పుడు 111 జీవో ఉందా?. 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదు. సీఎం రేవంత్‌ను కలిసి 111 జీవోపై నివేదిక ఇస్తాను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ
సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు. -
ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలొస్తే మనదే గెలుపు: కేటీఆర్
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో మన్నె గోవర్ధన్‌రెడ్డి, జెజొల్ల రాజు ముదిరాజ్, కొమ్ము విజయ్‌కుమార్, విజయ్‌కృష్ణ, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పర్యవేక్షణ లోపంతోనే రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి సుంకిశాల పంప్‌హౌస్ నీట మునిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆగస్టు 2న ఘటన జరిగినా అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకుండా..రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందన్నారు. సీఎంకు సమాచారం లేదంటే ఆయనకు పాలనపై పట్టు లేనట్టేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.పంప్‌హౌస్ నీట మునిగిన సమాచారం తెలియనంత మొద్దునిద్రలో ప్రభుత్వం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల ఒత్తిడితో హడావుడిగా గేట్లు, మోటార్లు బిగించడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, సీఎం పదవికి ఆయన అనర్హుడు అని విమర్శించారు. ‘చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకోవాలి. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ నాయకులతో కలసి సుంకిశాలను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు.వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు‘గతంలో మేడిగడ్డ కుంగుబాటు ఘటన జరిగిన వెంటనే కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి న ఘటనపై తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మంత్రులు బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మా మీద బట్టకాల్చి మీద వేస్తే సహించేది లేదు.ప్రాజెక్టు డిజైన్ కాదు.. భట్టి ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. గతంలో మేడిగడ్డపై హడావుడి చేసిన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఎందుకు రాలేదు. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. పంప్‌హౌస్ మునకతో కోట్లాది రూపాయల సంపద నీటి పాలైంది. హైదరాబాద్ మహానగర ప్రజలకు తీరని నష్టం వాటిల్లింది. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ బురదచల్లే ప్రయత్నాలు చేస్తోంది’ అని కేటీఆర్ విమర్శించారు. -
గుమ్మడికాయ దొంగ మాదిరే కేటీఆర్ తీరు
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి కేటీ రామారావు తీరుందని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు అంటూ వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలన్నీ కూడా బోగస్సేనని ఆరోపించారు.శుక్రవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగో లుగా లక్షల కోట్లు దోచుకుందని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళితబంధు, మిషన్ భగీ రథ అన్నీ కుంభ కోణాలేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. -
గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడితే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ గతంలో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?. పనికి రానీ మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు.గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీనే. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్‌లే. లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా?. రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.