ప్రాణాలతో పరాచికం | youth dangerous adventures in trains | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో పరాచికం

May 31 2014 10:24 PM | Updated on Sep 2 2017 8:08 AM

ప్రాణాలతో పరాచికం

ప్రాణాలతో పరాచికం

లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం కొందరు యువతకు నిత్యకృత్యంగా మారడంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

 సాక్షి, ముంబై: లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం కొందరు యువతకు నిత్యకృత్యంగా మారడంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోగీలపై ప్రయాణించడం, ప్రవేశద్వారానికి వేలాడుతూ విన్యాసాలు చేయడం, తిరిగే ఫ్యాన్లలో వేళ్లు పెట్టడం వంటివి లోకల్‌రైళ్లలో సర్వసాధారణంగా మారాయి. బోగీలపై ప్రయాణించిన వారిలో పలువురు మరణించడం, గాయపడడం తెలిసిందే. ఇలాంటి దుస్సాహసాలు చేయవద్దని రైల్వే అధికారులు ప్రతినిత్యం అనౌన్స్‌మెంట్ల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నా ఆకతాయిలు పట్టించుకోవడం లేదు.
 
వీరి చేష్టలు సహ ప్రయాణికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న వారిలో అత్యధికులు యువకులేనని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర విన్యాసాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టామని ప్రకటించారు. బోగీల్లో ప్రాంణాంతక విన్యాసాలు చేస్తూ గత నెల 500 మంది జీఆర్పీకి చిక్కారు. కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పోలీసులు మరో తరహా ప్రయత్నం మొదలుపెట్టారు. తప్పు చేసిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రాంణాంతక విన్యాసాలు చేసిన 618 మందిని పశ్చిమరైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు.
 
ఇదే కాలంలో సెంట్రల్ రైల్వేలోని బండ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేసిన 1,208 మందిని పట్టుకున్నారు. విన్యాసాలు వికటించి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఈ పనులు చేస్తున్న వారిలో అత్యధికులు 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు గల వారేనని తేలింది. ముంబై సెంట్రల్ సీనియర్ రైల్వే పోలీస్ రాజేంద్ర త్రివేది ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైళ్లలో విన్యాసాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. ‘వీరిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు.
 
తిరిగి ప్రాణాంతక విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ల తల్లిదండ్రులను రైల్వే స్టేషన్లకే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. విన్యాసాలు చేయడం ద్వారా యువకులు ఏ విధంగా మరణించడం..తీవ్ర గాయాలపాలైన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా సదరు తల్లిదండ్రులు పిల్లలను మందలించే అవకాశం ఉంటుంది. దీంతో యువకులు కూడా తిరిగి విన్యాసాలు చేయకుండా ఉంటారు’ అని త్రివేది వివరించారు. ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం తరచూ తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement