పోలీసులకు వీక్లీ ఆఫ్‌!

Weekly Off For Tamil nadu Police - Sakshi

చర్యలు వేగవంతం త్వరలో అమల్లోకి

అడ్వకేట్‌ జనరల్‌కు డీజీపీ లేఖ

సాక్షి, చెన్నై :  తమిళనాడు రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా పోలీసుల సంఖ్య లేదన్న విషయం తెలిసిందే. విశ్రాంతి లేకుండా, పని భారంతో  మానసిక ఒత్తిడికి గురై విధుల్ని నిర్వర్తిస్తున్న పోలీసులు, చివరకు ఆత్మహత్యలతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే,  మరికొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం, ఇంకొందరు తమకు ఈ ఉద్యోగాలు వద్దు బాబోయ్‌ అని రాజీనామాలు చేసి పరుగులు తీస్తున్నారు. విశ్రాంతి లేకుండా విధి నిర్వహణలో కుప్పుకూలుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే.

ఈ పరిణామాలన్నీ వెరసి వ్యవహారం మద్రాసు హైకోర్టుకు ఇటీవల చేరింది. ఇప్పటికే పోలీసుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆర్డర్లీ విధానం గురించి కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కృపాకరణ్‌ బెంచ్‌ పలుమార్లు తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది.  పోలీసులకు అండగా నిలబడే విధంగా ఉన్నతాధికారులపై న్యాయమూర్తి తీవ్రంగానే విరుచుకు పడ్డారు కూడా. ఆర్డర్లీ విధానం రద్దు అయినా, అనేక మంది అధికారుల ఇళ్ల వద్ద నేటికీ పోలీసులు పనిచేస్తూ వస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పోలీసులకు ఎందుకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్‌ ఇవ్వకూడదంటూ అడ్వకేట్‌ జనరల్‌ విజయనారాయణన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి కృపాకరణ్‌ స్పందించారు.

వారంలో ఓ రోజు సెలవు
రాజధాని నగరం చెన్నైతో పాటు పలు నగరాల్లో  పనిచేస్తున్న పోలీసులకు విశ్రాంతి లేదని చెప్పవచ్చు. ఇటీవల అదనపు పని గంటలు సైతం పనిచేయక తప్పని పరిస్థితి. ఇందుకు కారణం వీఐపీల తాకిడి అధికంగా ఉండడమే. తమ వాళ్లకు సెలవన్నది లేకపోవడంపై పోలీసు కుటుంబాలు తీవ్ర ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయమూర్తి కృపాకరణ్‌ బెంచ్‌ పోలీసుకు అండగా నిలుస్తూ, వీక్లీ ఆఫ్‌ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించడం విశేషం. దీనిని పోలీసుల కుటుంబాలుఆహ్వానిస్తున్నాయి.అదే సమయంలో ఇది అమల్లోకి వచ్చేనా అన్న ప్రశ్న బయలుదేరి  ఉన్న నేపథ్యంలో త్వరలో వీక్లీ ఆఫ్‌లు షురూ అన్నది స్పష్టం అవుతోంది.

ఆమేరకు అడ్వకేట్‌ జనరల్‌ విజనారాయణన్‌కు డీజీపీ రాజేంద్రన్‌ లేఖ పంపించారు. సోమవారం లేదా, మంగళవారం పోలీసులకు సంబంధించి న్యాయమూర్తి కృపాకరణ్‌ బెంచ్‌ ముందు ఉన్న పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆబెంచ్‌ ముందు వాదనల్ని ఉంచేందుకు తగ్గట్టుగా అడ్వకేట్‌ జనరల్‌కు వివరాల్ని డీజీపీ పంపిం ఉన్నారు. పోలీసులు అదనపు సమయం పనిచేసిన పక్షంలో వారికి అందుకు తగ్గ రూ.రెండు వందలు కేటాయించాలని వివరించారు. అలాగే, కోర్టు ముందు ఉంచాల్సిన మరికొన్ని వివరాలను అందులో పొందు పరచడమే కాకుండా, వీక్లీ ఆఫ్‌ ప్రస్తావనను డీజీపీ తీసుకొచ్చారు. వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్‌ను పోలీసులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. షిఫ్ట్‌ల వారీగా ఈ వీక్లీ ఆఫ్‌ కేటాయింపులకు కసరత్తులు సాగుతున్నాయని, త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొని ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top