రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలను సిద్ధం చేశామని విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి వివరించారు.
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలను సిద్ధం చేశామని త్వరలోనే వాటిని అమల్లోకి తేనున్నామని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి వివరించారు.పదో ఆర్థిక సంఘం సిఫార్సులను మోడల్ స్కూల్ టీచర్లకు వర్తింపచేస్తామని, సీఎం ఆమోదముద్ర పడగానే దీన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దీనిపై సీఎం నిర్వహించిన సమావేశాల్లో చర్చ జరిగిందన్నారు.
రాష్ట్ర మోడల్ స్కూళ్ల టీచర్ల సంఘం అధ్యక్షుడు కర్నాటి రాజశేఖరరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌రావు, ప్రధానకార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు మంగళవారం కమిషనర్‌ను కలసి ఆదర్శ పాఠశాలల టీచర్ల సమస్యలపై విన్నవించారు. వీటిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఎంఎస్‌టీఏ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి వివరించారు. మోడల్ స్కూళ్ల టీచర్ల ఆర్జిత సెలవులపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామని కమిషనర్ చెప్పారన్నారు. టీఎన్‌యూఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, ఆర్‌జేయూపీ సలహాదారు వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.


