జీఎస్‌ఎల్‌వీ-డీఎస్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీసిటీ యూజమాన్యం, భారత వాణిజ్య, వ్యాపార మండలి (అసోచెమ్, దక్షిణం) సంయుక్తంగా గురువారం రాత్రి సన్మానించారుు
చెన్నై, సాక్షి ప్రతినిధి:
జీఎస్‌ఎల్‌వీ-డీఎస్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీసిటీ యూజమాన్యం, భారత వాణిజ్య, వ్యాపార మండలి (అసోచెమ్, దక్షిణం) సంయుక్తంగా గురువారం రాత్రి సన్మానించారుు. ఈ సందర్భంగా సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తనకు చేసిన సన్మానాన్ని ఇస్రోకు అంకితం ఇస్తున్నానని అన్నారు. ఒక ప్రయోగం ఫలప్రదానికి ఇస్రోలోని అందరి కృషి ఉంటుందన్నారు. ప్రత్యక్షంగా 16,500 ఉద్యోగులతో పాటు సుమారు 50 వేల మంది సమష్టిగా పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఇస్రో కేంద్రాలు, కార్యాలయాల్లో అంతరిక్ష నౌక, శాటిలైట్ తయారై శ్రీహరికోటలోని లాంచింగ్ పాడ్ వద్ద ఒకటిగా అమర్చి ప్రయోగం చేపడతామని తెలిపారు. అందరూ రాకెట్ ప్రయోగించే స్థానానికే విజయాన్నంతా కట్టబెడతారని చమత్కరించారు. అందుకే ఈ సన్మానం ప్రతి ఒక్కరికీ చెందుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ కింద తమకు కేటాయించే 0.4 శాతం నిధులు (రూ.5వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు)కు తాము జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధికి అందుబాటులోకి తేవడం తమ కర్తవ్యమని చెప్పారు.
శ్రీసిటీ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-డీఎస్‌ను సమర్ధవంతంగా ప్రయోగించడం ద్వారా భారత్ కీర్తిప్రతిష్టలు మరోసారి ఆకాశాన్ని తాకాయని ప్రశంసించారు. ఈ ఘనతను సాధించిన షార్ శాస్త్రవేత్తలను సన్మానించుకోవడం భారతీయులుగా తమ కనీస బాధ్యతని పేర్కొన్నారు. సన్మానం అందుకున్న వారిలో షార్ శాస్త్రవేత్తలు వి.శేషగిరిరావు (అసిస్టెంట్ డెరైక్టర్), ఎస్వీ సుబ్బారావు (డెప్యూటీ డెరైక్టర్, వాస్ట్), ఎంఎస్ పన్నీర్ సెల్వం (రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్), వి.రంగనాథన్ (సీజీఎం, ఎస్‌పీపీ), ఎం.బద్రీనారాయణ మూర్తి (సీజీఎం, ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్) ఉన్నారు. శ్రీసిటీ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డితోపాటు చెన్నైలోని జపాన్, థాయిలాండ్, మలేషియా, జర్మనీ దేశాల వాణిజ్య దూతలు షార్ శాస్త్రవేత్తలను సన్మానించి అభినందించారు. అంతకుముందు ప్రముఖ సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.