తన పరిధిలోని పాత తారురోడ్లన్నింటికీ పూతవేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది.
సాక్షి, ముంబై: తన పరిధిలోని పాత తారురోడ్లన్నింటికీ పూతవేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రతిపాదన ఒకట్రెండు రోజుల్లో స్థాయిసమితి ముందుకు రానుంది. ప్రతిపాదనకు ఆమోదం లభించగానే టెండర్లు ఆహ్వానిస్తారు. ప్రస్తుతం గుంతలమయంగా కనిపిస్తున్న రోడ్లన్నీ పూతల తరువాత అందంగా దర్శనమివ్వనున్నాయి. ముంబైలోని అనేక చిన్న, పెద్ద రోడ్లను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. తవ్వకాలు, నీళ్లు చేరడం వల్ల రోడ్లన్నీ బీటలు వారడమేకాకుండా గుంతలు పడ్డాయి. భూగర్భంలో డ్రైనేజీ, తాగునీటి పైపులు పగిలిపోయి నీరంతా రోడ్లపైకి రావడంతో తారు కొట్టుకుపోయింది.
ఇలా పాతబడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎంసీ భావించింది. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించే అవకాశాలున్నాయని స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే ధీమా వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టే సమయంలో రోడ్లతోపాటు భూగర్భంలో ఉన్న డ్రైనేజీ, తాగునీటి పైపులనూ మార్చుతారు. ఇందుకోసం నియమించిన సలహాదారుల సమితి మార్గదర్శకాల ప్రకారం వార్డుల వారీగా ఊహాచిత్రాలు రూపొందించారు. పర్యాటకులకు ఆకర్శణగా నిలిచిన మెరైన్‌డ్రైవ్ రోడ్డునూ ఆధునీకరిస్తారు. ఇక్కడి రహదారిని 1940లో నిర్మించారు. మెరైన్‌డ్రైవ్ ప్రాంత రోడ్డు సముద్రానికి ఆనుకుని ఉంది. సముద్రం నుంచి వచ్చే ఉప్పుగాలులతో ఈ రహదారి బాగా దెబ్బతింది. అందుకే దీనిని పూర్తిగా త వ్వి కొత్తగా రోడ్డు వేయనున్నారు. ఇందుకోసం మెకనైజ్ మాస్టిక్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని శేవాలే చెప్పారు.
పప్పుబెల్లాలపై పట్టింపేది ?
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో బెల్లం, పల్లిచిక్కీ అందజేసే పథకం అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీఎంసీ పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు పూర్తికావస్తున్నాయి. మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలూ పూర్తవుతాయి. మధ్యాహ్న భోజనంలో చిక్కీలు, బెల్లం మాత్రం ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఇంత పెద్ద మొత్తంలో చిక్కీలు సరఫరా చేసేందుకు ఇంత వరకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడమే. బీఎంసీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం అనివార్యమే అయినా, చిక్కీ, సుగంధ పాలు కచ్చితంగా ఇవ్వాలనే నియమాలు ఏమీ లేవని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఇక నుంచి విద్యార్థులకు చిక్కీలు, బెల్లం దూరమయినట్టేనని చెబుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కింద సుగంధ పాలు పంపిణీ చేసే పథకాన్ని బీఎంసీ రెండేళ్ల కిందట మొదలుపెట్టింది. అవి అజీర్తి చేయడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇలా పలుమార్లు జరగడంతో చివరకు సుగంధ పాల పథకాన్ని నిలిపివేశారు. వీటిస్థానంలో పండ్లు లేదా చిక్కీ పంపిణీచేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది.
పండ్లు త్వరలో పాడయ్యే అవకాశాలుంటాయి కాబట్టి చిక్కీ పంపిణీ తెర మీదకు తెచ్చింది. బీఎంసీ పాఠశాలల్లో సుమారు 4.50 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీరోజు 16 మెట్రిక్ టన్నుల చిక్కీలు అవసరముంటాయి. ఇంత భారీ పరిమాణంలో సరఫరా చేసే టెండరును ఏ ఒక్క కంపెనీ కూడా స్వీకరించలేదు. రెండుసార్లు ఆహ్వానించినా టెండర్లకు ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. భారీగా చిక్కీలు తయారు చేసే బాధ్యతలు ఒకే కంపెనీకి అప్పగించకుండా నగరం, పశ్చిమ, తూర్పు శివారు ఇలా ప్రాంతాలుగా విభజించి మూడు వేర్వేరు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించాలని విద్యాశాఖ సమితి అధ్యక్షుడు మనోజ్ కొటక్ సూచించారు. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేశాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి పాఠశాలలు పనిచేసేది కేవలం మూడు నెలలు మాత్రమే. టెండర్లను ఆహ్వానించడం, ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే ప్రక్రియ పూర్తిచేయాలంటే కొంత సమయం తప్పనిసరి. ఆపాటికి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. కాబట్టి ఈ ఏడాది విద్యార్థులు చిక్కీ, బెల్లానికి దూరమయినట్టేనని బీఎంసీ వర్గాలు తెలిపాయి.