పళని ఉపదేశం | Sakshi
Sakshi News home page

పళని ఉపదేశం

Published Thu, Jul 13 2017 3:59 AM

పళని ఉపదేశం

ఎంపీలతో భేటీ
తమిళ గళంపై హిత బోధ
కోవింద్‌కు ఓటు సూచన

అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఎంపీలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. సచివాలయం వేదికగా బుధవారం గంటన్నర పాటుగా ఈ సమావేశం సాగింది. పార్లమెంట్‌లో తమిళ గళం వినిపించాలని , కోవింద్‌కు మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హిత బోధ చేశారు.
సాక్షి, చెన్నై : తమిళ ప్రజల సమస్యలపై కేంద్రంలో గళం పెంచాలని ముఖ్యమంత్రి తమ ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు సీఎం పళని స్వామి సూచించారు. అన్నాడీఎంకేకి 37 మంది పార్లమెంట్, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇందులో పన్నెండు మంది మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు.

మిగిలిన 38 మంది అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరు శిబిరాలు బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తమ మద్దతును వేర్వేరుగా ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో తమ శిబిరం మద్దతు ఎంపీలకు సీఎం పళని స్వామి ఆగమేఘాలపై ఆహ్వానం పంపించారు. కొందరు ఢిల్లీలో ఉండడంతో అందుబాటులో ఉన్న మిగిలిన వారు సీఎం పిలుపుతో బుధవారం మధ్యాహ్నం సచివాలయం వద్ద  వాలిపోయారు.

ఓటు.. ఆపై ఒత్తిడి గంటన్నర పాటుగా సచివాలయం వేదికగా సీఎంతో సాగిన ఈ భేటీలో పార్లమెంట్‌లో అన్నాడీఎంకే సీనియర్‌ ఎంపీగా ఉన్న వేణుగోపాల్, రాజ్యసభలో సీనియర్‌ ఎంపీగా ఉన్న నవనీతకృష్ణన్‌తో పాటుగా ఇరవై మంది వరకు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తగ్గ ఉపదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అందరి ఓటు కోవింద్‌కు పడే రీతిలో చర్యలు తీసుకోవాలని, ఇందుకు తగ్గ బాధ్యతల్ని వేణుగోపాల్, నవనీతకృష్ణన్‌లకు పళని స్వామి అప్పగించడం గమనార్హం.

ఇక, రాష్ట్రపతి ఎన్నిక తదుపరి సాగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తమిళ గళం మార్మోగే రీతిలో ముందుకు సాగాలని ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నారు. జీఎస్‌టీలోని కొన్ని అంశాలతో తమిళనాడుకు ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు, తమిళ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో అమల్లో ఉన్న కేంద్ర పథకాలకు నిధుల వ్యవహారం, కొన్ని పథకాల కారణంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, హైడ్రో కార్బన్‌ తవ్వకాలు తదితర అంశాలపై చర్చ అనంతరం, ఈ విషయాలన్నింటినీ పార్లమెంట్, రాజ్యసభల దృష్టికి తీసుకెళ్లాలని, తమిళులకు న్యాయం చేకూరే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా గళాన్ని వినిపించాలని హితబోధ చేశారు.

తమిళ గళం వినిపిస్తాం
సీఎంతో భేటీ అనంతరం నవనీతకృష్ణన్‌ మీడియాతో మాట్లాడారు. జీఎస్‌టీ, హైడ్రో కార్బన్, నీట్, రాష్ట్రపతి ఎన్నికల విషయంగా చర్చించుకున్నట్టు వివరించారు. జీఎస్‌టీ రూపంలో తమిళనాడుకు కొన్ని సమస్యలు ఎదురై ఉన్నాయని, వాటన్నింటినీ ఉభయ సభల్లో ప్రస్తావించనున్నామన్నారు. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని కేంద్ర పథకాల్ని నిలుపుదల చేయించడం, నీట్‌ మినహాయింపు తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడుకు న్యాయం చేకూర్చే విధంగా తమ గళాన్ని పార్లమెంట్‌లో వినిపిస్తామన్నారు. తమిళులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బీజేపి అభ్యర్థికి తాము మద్దతు ఇస్తున్నామని, ఆయనకు మద్దతుగానే తమ వారందరి ఓటు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement