రూ.6.85 కోట్లు అక్కర్లేదా? | No takers for Rs. 6.85 crore seized by poll officials | Sakshi
Sakshi News home page

రూ.6.85 కోట్లు అక్కర్లేదా?

Mar 16 2014 12:49 AM | Updated on Sep 2 2017 4:45 AM

ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన రూ.6.85 కోట్లను తగిన ఆధారాలతో విడిపించుకునేందుకు ఎవ్వరూ రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

 చెన్నై, సాక్షి ప్రతినిధి:ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన రూ.6.85 కోట్లను తగిన ఆధారాలతో విడిపించుకునేందుకు ఎవ్వరూ రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఓటుకు నోటు విధానాన్ని అరికట్టేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నటుడు కమల్‌హాసన్‌తో రూపొందించిన లఘుచిత్రాన్ని ఆయన శనివారం విడుదల చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు వాహనాల తనిఖీలో రూ.6.85 కోట్ల నగదు పట్టుబడిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళుతుంటే తమ వెంట తగిన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని ఇప్పటికే అనేక సార్లు ప్రచారం చేశామని చెప్పారు. ఒక వేళ డబ్బు పట్టుబడినట్లయితే ఆ తరువాతైన తగిన డాక్యుమెంట్లు చూపి తిరిగి తీసుకెళ్లమని పదేపదే చెబుతున్నామని అన్నారు. అయితే ఇప్పటి వరకు పట్టుబడిన నగదును ఆధారాలు చూపి పట్టుకెళ్లేందుకు ఎవ్వరూ ముందుకురాలేదని తెలిపారు. ఓటుకు నోటు కూడదని పేర్కొం టూ ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్, బాలీవుడ్ నటి దీపికా పదుకునేలతో లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.
 
 తాజాగా కమల్‌హాసన్‌తో రూపొం దించిన చిత్రాన్ని రాష్ట్రంలోని కేబుల్‌నెట్‌వర్క్, సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్లవద్దకు వచ్చి నగదును అందజేస్తే తమ సెల్‌ఫోన్‌లో వారి ఫొటోను తీసి తమకు పంపితే చర్య తీసుకుంటామని తెలిపారు. ఓటుకు నోటు ఇస్తే తీసుకోండని డీఎండీకే అధినేత విజయకాంత్ తన ప్రసంగం ద్వారా ప్రచారం చేస్తున్నారని మీడియా ప్రశ్నించింది. తాను డబ్బులు ఇస్తానని ప్రచారం చేస్తే మాత్రమే తప్పు, అయినా ఆ వ్యాఖ్యలపై విచారించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. మినీ బస్సులపై రెండాకుల చిహ్నం తొలగింపుపై ఈనెల 17న కోర్టులో విచారణ జరుగుతున్నందున రాష్ట్ర ర వాణాశాఖ గడువు కోరిందని తెలిపారు. ఎన్నికలకు 3 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, ఇంకా అవసరమైతే ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది సేవలు తీసుకుంటామని చెప్పారు. రెండుగంటలకు మించి ప్రయాణ దూరంలో మహిళా సిబ్బందిని నియమించబోమని, రాత్రివేళ బస అవసరం ఉండదని అన్నారు.
 
 ఓటు వివరాలకై ఎస్‌ఎమ్‌ఎస్
 జాబితాలో తమ ఓటు వివరాలను ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తమ సెల్‌ఫోనులో ఈపీఐసీ అనే ఇంగ్లీషు చిన్నక్షరాలను టైప్‌చేసి, స్పేస్ ఇచ్చి ఓటరు కార్డులోని నెంబరును టైప్‌చేసి 9444123456కు ఎస్‌ఎమ్‌ఎస్ చేయాలని చెప్పారు. వెంటనే సదరు ఓటరుకు ఏ కేంద్రంలో, ఏ జాబితాలో ఓటుందో ఎస్‌ఎమ్‌ఎస్ వస్తుందని అన్నారు. ఒకవేళ ఓటు లేనట్లయితే 1950 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement