
అబ్బాయికి 18, అమ్మాయికి 24
అబ్బాయికి 18, అమ్మాయికి 24... వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.
► పెద్దలు అంగీకరించరని ప్రేమ వివాహం
► పోలీసులకు ఫిర్యాదు చేసిన అబ్బాయి బంధువులు
మైసూరు : అబ్బాయికి 18, అమ్మాయికి 24... వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్లు తేడా ఉండటంతో వరుడి బంధువులు ఈ పెళ్లికి ఇష్ట పడలేదు. దీంతో ఇద్దరు ప్రేమికులు ఓ దేవాలయలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం వరుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు... ఇక్కడి మండి మోహల్లాకు చెందిన ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ఒకే చోట పనిచేస్తుండటంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొద్దికాలంలో సరదాగా తిరిగారు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసి కనీస పెళ్లి వయసు కూడా రాలేదని, పెళ్లి చేయమని తెగేసి చెప్పారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన ప్రేమికులు ఆదివారం నగరంలోని సయ్యాజీ రావు రోడ్డులో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వరుడి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తమ కుమారుడు మైనర్ అని, అతడికి బలవంతంగా పెళ్లి చేశారని మండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులను పిలిపించి విచారణ చేశారు. తమ ఇష్టపకారమే పెళ్లి చేసుకున్నామని వారు చెబుతున్నారు.