రగిలిన ఫైర్

రగిలిన ఫైర్ - Sakshi

  • బహిరంగంగా గవర్నర్, సీఎం పరస్పర విమర్శలు

  •   కరువు నివారణ పనుల్లో అలసత్వం : గవర్నర్

  •  కోడ్ వల్లే ఆలస్యమని సీఎం చెబుతున్నారు

  •  కరువు పనులకు కోడ్ అడ్డుకాదు

  •  న్యాయశాఖ మంత్రిగా పనిచేశా..   కోడ్ గురించి నాకు తెలియదా?

  •  నెలన్నరగా పరిష్కారం కాని సమస్యలు

  •  ఇకనైనా మంత్రులు, అధికారులు స్పందించాలి

  •  సాక్షి, బెంగళూరు :  రాష్ర్ట ప్రభుతం పనితీరుపై ఇన్నాళ్లూ నాలుగు గోడల మధ్య అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ మొదటి సారిగా బహిరంగంగా సీఎం, మంత్రులను విమర్శించారు. వాటిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఘాటుగానే స్పందించారు. పరోక్షంగా గవర్నర్‌పై ఎదురుదాడికి దిగారు. బసవ జయంతి సందర్భంగా బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ వద్ద ఉన్న బసవణ్ణ విగ్రహానికి గవర్నర్ పూలమాల వేసి శుక్రవారం నివాళుర్పించారు.



    అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణ పనులు సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రిని రాజ్‌భవన్‌కు పిలిపించుకుని మాట్లాడానని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ పనులు చేపట్టడానికి వీలుకాలేదని సీఎం చెప్పుకొచ్చారని తెలిపారు. అయితే కరువు నివారణ పనులు చేపట్టడానికి కోడ్ అడ్డుకాదని, 15 ఏళ్ల పాటు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన తనకు ఈ విషయం స్పష్టంగా తెలుసునని అన్నారు. రాష్ర్టంలో ప్రజాసమస్యలు దాదాపు నెలన్నరగా పరిష్కారం కావడం లేదని, ఇకనైనా మంత్రులు, అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఘాటుగా విమర్శించారు.

     

    సీఎం ఎదురుదాడి..

     

    గవర్నర్ విమర్శలపై సీఎం సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. కరువు నివారణ పనులు చేపట్టడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ప్రభుత్వం బాగా పనిచేస్తోందని తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన శుక్రవారం మాట్లాడారు. బసవణ్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ విభాగాలకు చెందిన మంత్రులు, అధికారులు ప్రజా సమస్య పరిష్కారం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కృషి చేస్తున్నారన్నారు.



    ఈ విషయమై తమకు ఎవరి సర్టిఫికెట్టు అవసరం లేదని పరోక్షంగా గవర్నర్‌ను దెప్పిపొడిచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. మీడియా కూడా వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలని, గవర్నర్‌తో తాను భేటీ అయినప్పుడు తమ మధ్య నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు.  

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top