
రైతులను వేధిస్తే... సహించం
రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యల వెనుక అప్పులిచ్చిన వారి వేధింపులే ప్రధానంగా కనిపిస్తున్నాయని, ఇకముందు ఎక్కడైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే
బెంగళూరు(బనశంకరి) : రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యల వెనుక అప్పులిచ్చిన వారి వేధింపులే ప్రధానంగా కనిపిస్తున్నాయని, ఇకముందు ఎక్కడైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పులిచ్చిన వారినే బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. రోజురోజుకూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య పెరిగిపోతుండడంతో శనివారం వివిధ మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆకాశవాణిలో మన్‌కిబాత్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా రైతులు ఆత్మహత్య చేసుకోరాదని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సమస్యలను తనృదష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరించేందుకుృకషి చేస్తానని అన్నారు.
ఆత్మబలంతో బతుకుదామని... ఆత్మహత్యకు పాల్పడబోమంటూ ప్రతిజ్ఞచేయాలంటూ రైతులకు మనవి చేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని తనకు వ్యవసాయంలో కష్టనష్టం అనేది క్షుణ్ణంగా తెలుసునని అన్నారు. అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చూస్తుంటే ఎంతో బాధకలుగుతోందని అన్నారు. రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందిస్తుందని, సమస్యల పరిష్కారానికి రైతు సంపర్క సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రుణాలు ఇచ్చే వారు ఇకముందు రైతుల నుంచి అదిక వడ్డీ వసూలు చేసినట్లు కనబడితే ప్రభుత్వం మనీల్యాండరింగ్, పాన్‌బ్రోకర్ తదితర చట్టాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి గురించి రైతు సహాయవాణి లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని భరోసానిచ్చారు. 2013-14 లో 58 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2014-15 లో 48 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక అందిందన్నారు. ఈ ఏడాది 70 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఇది తమను తీవ్రంగా బాధించిందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఎవరు రాజకీయాలు చేయరాదన్నారు. ప్రభుత్వం, సమాజం ఒక్కటిగా రైతులకు మద్దతుగా నిలవాలని మనవి చేశారు.