కాళ్ల కింద నేల కదులుతోంది | Earthquake Waves in Rainy Season Karnataka | Sakshi
Sakshi News home page

కాళ్ల కింద నేల కదులుతోంది

Jul 10 2020 8:55 AM | Updated on Jul 10 2020 8:55 AM

Earthquake Waves in Rainy Season Karnataka - Sakshi

కొడగు జిల్లా విరాజపేట–మకుట మార్గంలో కుప్పకూలిన మట్టిచరియలు

చిన్న వర్షం వస్తుంది, అంతలోనే ఎగువ నుంచి మన్ను ఉప్పెనలా ముంచుకొస్తుంది. అడ్డొచ్చిన ఇళ్లు, మనుషులను కబళిస్తుంది. ఒక్కోసారి వర్షం రాకుండానే ఈ ఉపద్రవాలు జరుగుతుంటాయి. మన్ను,బండరాళ్లు జారిపడి  తరచూ కట్టడాలు, రహదారులు ధ్వంసం కావడం కొడగు, మల్నాడు జిల్లాల్లో మామూలు విషయంగా మారింది. వర్షాలు జోరందుకోవడంతో మళ్లీ మట్టి చరియల విపత్తు పొంచి ఉంది.

హుబ్లీ: కాళ్ల కింది భూమి కదిలిపోతోంది. చిన్న వర్షం వచ్చినా, రాకపోయినా నేల కుదించుకుపోతూ ప్రాణ ఆస్తి నష్టాలకు గురిచేస్తోంది. దశాబ్దకాలంగా నైరుత్య కర్ణాటకలోని మల్నాడు జిల్లాల్లో మట్టి చరియలు జారిపడడం, ఇళ్లు, మనుషులను ముంచేస్తుండడం, ప్రత్యేకించి వర్షాకాలం వస్తుండగానే ఈ పెనుముప్పు ఆరంభమవుతోంది. దీంతో కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, హాసన్‌ జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఎత్తైన కొండలు, మట్టి దిబ్బల దిగువన వందలాది ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు మట్టి చరియలు జారిపడే బెడద క్షణక్షణం వెంటాడుతోంది.  

భూ ప్రకంపనలు సైతం
ఓ మోస్తరు వర్షం తాకిడికి మట్టి పొరలు వదులై కింది ప్రాంతం వైపు జారుతూ అది పెద్ద విపత్తు అవుతున్నాయి. 2009లో వర్షాకాలంలో ఉత్తర కన్నడ జిల్లాలో ఒకేరోజు 20 చోట్ల మట్టిచరియలు కూలినట్లు నమోదైంది. 19 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. పులి మీద పుట్రలా కొడగు తదితర ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు మట్టి చరియలు కూలడానికి మరింత కారణమవుతున్నాయి.  

మానవుల చర్యలూ కారణమే
పశ్చిమ కనుమల్లో భాగమైన కొడగు, చిక్కమగళూరు తదితర జిల్లాల్లో మట్టితో కూడిన పెద్ద పెద్ద పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టుగా ఉంటున్నాయి. అపురూపమైన వన్యప్రాణి సంపద కూడా ఈ ప్రాంతాల సొత్తు. ఫలితంగా ఏటా లక్షలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి వస్తుంటారు. ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందేకొద్దీ కొత్త కొత్త ప్రాంతాలకు నిర్మాణాలు విస్తరించాయి. అడవులను, పల్లపుప్రాంతాలను చదును చేసి రిసార్టులు, భవనాలు తదితరాలను నిర్మిస్తూ వచ్చారు. ఒకప్పుడు అడవులు, పొదలతో కూడిన ప్రాంతాలు ఇప్పుడు జనావాసాలుగా మా­రాయి. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో మట్టి చరియలు కూలినప్పుడల్లా అది ప్రాణ ఆస్తి నష్టానికి దారితీస్తూ సంచలనాత్మకమవుతోంది. ఇక్కడ ఎక్కువగా కుండపోత వర్షాలు కురవడం, మట్టితో కూడిన పర్వతాలు, బలహీనమైన నేల స్వభావం, మానవుల చర్యలు వంటివి కూడా దోహదం చేస్తున్నాయి. 

నిపుణుల అధ్యయనాలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ, పర్యావరణ ఉన్నతాధికారులతో పాటు ఇస్రో, ఐఐఎస్‌సీకి చెందిన నిపుణులు ఉన్నారు. కొడగు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎందుకు చరియలు కూలుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇటీవలే ఈ సమితి సీఎం యడియూరప్పకు నివేదికను అందజేసినప్పటికీ మళ్లీ వర్షాకాలం రావడం, కరోనా లాక్‌డౌన్‌ వల్ల అమలు అనేది ఆలస్యమవుతోంది.

తరచూ ప్రమాదాలు 
రాష్ట్ర అటవీ– పర్యావరణ, జీవ వైవిధ్య మండలి ఈ సమస్యపై అధ్యయనం చేసినప్పటికీ, కారణాలను, పరిష్కారాలను కనుగొనడం దుర్లభంగా మారింది. ఐదురోజుల కిందట మంగళూరు వద్ద మట్టి చరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రెండేళ్ల కిందట కొడగు జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు పదుల సంఖ్యలో మట్టిచరియలు కూలిన దుర్ఘటనలు జరిగాయి. ఒక సంఘటనలో ఏడుగురికిపైగా మృత్యువాత పడగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద భవనాలు సైతం మట్టి చరియల తాకిడికి తలకిందులయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement