డోర్ కర్టన్లు, ఆ కర్టన్లు పెట్టుకునే స్టీల్ రాడ్ల కొనుగోళ్లలో దాదాపు రూ.20 లక్షల అవినీతికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారి మీనాపై దాఖలైన చార్జిషీటు వివరాలు సీవీసీకి చేరాయి.
డోర్ కర్టన్లు, ఆ కర్టన్లు పెట్టుకునే స్టీల్ రాడ్ల కొనుగోళ్లలో దాదాపు రూ.20 లక్షల అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ ఏసీబీ చీఫ్ ముకేశ్ కుమార్ మీనాపై నమోదయిన కేసు వివరాలను ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)కు పంపింది. 2005లో ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్గా పనిచేసిన కాలంలో మీనా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయన సహచరులుగా పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారుల ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బయటికొచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, మీనాపై విచారణ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్కు, ఆమ్ ఆద్మీ సర్కారుకు విబేధాలు తలెత్తాయి. దీంతో వ్యవహారారం కాస్తా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, సీఎన్జీ వాహనాలకు ఫిట్నెస్ మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ మీనాపై దాఖలైన మరో కేసులో.. ప్రభుత్వం జారీ చేసిన సమన్లకు స్పందించనందున మీనాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీచేయడంతోపాటు అతడి వేతనంలో 30 శాతం కోత విధించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంటు జారీని సెప్టెంబర్ 23 వరకు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.