ఆప్, బీజేపీలు నాణేనికి రెండు ముఖాలు | BJP and AAP two sides of same coin: C | Sakshi
Sakshi News home page

ఆప్, బీజేపీలు నాణేనికి రెండు ముఖాలు

Dec 28 2014 10:48 PM | Updated on Sep 2 2017 6:53 PM

బీజేపీ, ఆప్‌లు నాణానికి రెండు ముఖాల వంటివని, వాటి తప్పుడు వాగ్దానాలకు మోసపోకూడదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్

న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్‌లు నాణానికి రెండు ముఖాల వంటివని, వాటి తప్పుడు వాగ్దానాలకు మోసపోకూడదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నగర ఓటర్లను హెచ్చరించింది. ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు ఏమి సాధించాయో చూసి అందుకనుగుణంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తోందని, ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ప్రశ్నించారు.
 
 ఢిల్లీ అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రేడియో ప్రకటనలకు ఐదు కోట్లు వెచ్చించారని చెప్పారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి హోర్డింగులు, అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం ఖర్చు పెట్టేందుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం లేదని అన్నారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన పార్టీకి ఆర్థిక మద్దతు ఎక్కడి నుంచి లభిస్తోందని అన్నారు. సామాన్యుని గొంతుకగా ఉంటామని పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన 49 రోజుల్లోనే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు వారు నెలకొల్పిన హోర్డింగుల్లో జన్‌లోక్‌పాల్ ప్రస్తావనే లేదని విమర్శించారు.  49 రోజుల పాలనలో చౌకగా విద్యుత్, తాగునీరు అందించామని చెబుతున్నారని, ఆ సదుపాయాలను పొందిన వ్యక్తి ఒక్కరు కూడా తమకు ఎదురు పడలేదని లవ్లీ ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement