తమిళనాడుకు కొత్త గవర్నర్‌

Banwarilal Purohit is new Governor of Tamil Nadu - Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. ఆదివారం తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్‌ నికోబార్‌ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తమిళనాడుకు ఏడాది తర్వాత పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించినట్లయింది. ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్‌ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే అండమాన్, నికోబార్‌ దీవుల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్న జగదీశ్‌ ముఖిని పురోహిత్‌ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు.

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్‌ మాలిక్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్‌.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్‌ఎస్‌జీలో పని చేసిన రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ బీడీ మిశ్రా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్‌ అడ్మైరల్‌ మాజీ చీఫ్‌ దేవేంద్ర కుమార్‌ జోషి.. అండమాన్, నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాడుకు ఏడాది కాలంగా పూర్తిస్థాయి గవర్నర్‌ లేని విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌ నుంచి మహా రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త గవర్నర్ల గురించి క్లుప్తంగా...

బన్వారీలాల్‌ పురోహిత్‌: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీ య, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలు గా క్రీయాశీలంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్‌ దినపత్రికను పునరుద్ధరించారు.

సత్యపాల్‌ మాలిక్‌: ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు. బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు. 1990 ఏప్రిల్‌ 21 నుంచి 1990 నవంబర్‌ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్‌ గవర్నర్‌ పదవి ఈయనకు వరించింది.

గంగా ప్రసాద్‌: 1994లో బిహార్‌ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నిక య్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు.
జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.

దేవేంద్ర కుమార్‌ జోషి: 1974 ఏప్రిల్‌ 1న ఇండియన్‌ నేవీ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్‌ స్టాఫ్‌ చీఫ్‌గా చేశారు. ఐఎన్‌ఎస్‌ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా∙పతకం అందుకున్నారు.

బీడీ మిశ్రా: ఎన్‌ఎస్‌జీ (బ్లాక్‌ కాట్‌ కమాండోస్‌) కౌంటర్‌ హైజాక్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్‌ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్‌ అయిన తర్వాత కూడా కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌లో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top