లొసుగుల టీ నోట్‌ను రాష్ట్రపతికి పంపుతారా ? | A note to the President of the tea till Send anyway? | Sakshi
Sakshi News home page

లొసుగుల టీ నోట్‌ను రాష్ట్రపతికి పంపుతారా ?

Dec 29 2013 3:39 AM | Updated on Sep 17 2018 5:10 PM

సమైక్యాంధ్ర సాధన కోసం పలు సంఘాలు ఒక్కటవుతున్నా రాజకీయ నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రశ్నించారు.

 = ప్రథమ పౌరుడిని పక్కదారి పట్టిస్తున్నారా...?
 =  కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు

 
బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసం పలు సంఘాలు ఒక్కటవుతున్నా రాజకీయ నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతికి ఇచ్చిన టీ నోట్‌లో లొసుగులు ఉన్నాయని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, వాటిలో నిజంగా లొసుగులు ఉంటే యుపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిని పక్కదోవపట్టించడానికి ప్రయత్నించిందా? లొసుగులు ఉన్న నోట్‌ను రాష్ట్రపతికి ఎలా పంపించారు? అని ఆయన ప్రశ్నించారు.

దేశ ప్రథమ పౌరుడికి ఇచ్చే నోట్ ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ర్టపతి తల వంచరాదని విజ్ఞప్తి చేశారు.  సమైక్యాంధ్ర కోసం శక్తి వంచనలేకుండ కృషి చేసే నాయకులకు ప్రజలు ఓట్లు వేస్తారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు వంద సంఘాలు కలిసి తెలుగు ప్రజా వేదికగా ఏర్పడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమానికి సిద్ధం కాగా రాజకీయ నాయకులు జేఏసీగా ఏర్పడటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సమైక్యాంధ్ర కోసం ఎవరు పోరాటం చే స్తున్నారు, ఎవరు రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు జనవరి ఒకటిన జై సమైక్యాంధ్ర.... జై జై సమైక్యాంధ్ర నినాదాలతో రాసిన బోర్డులు తమ ఇళ్ల ఎదుట తగిలిస్తామని బొందు రామస్వామి అన్నారు. సమావేశంలో కేటీపీఎస్ నాయకుడు శివకుమార్ పాల్గొన్నారు. ఇదే సందర్భంలో కొత్తచెరువు వద్ద రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు కర్ణాటక తెలుగు ప్రజా సమితి తరుపున బొందు రామస్వామి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement