వీక్లీ ఆఫ్! | A day off from work for the beat police | Sakshi
Sakshi News home page

వీక్లీ ఆఫ్!

Jul 18 2016 2:40 AM | Updated on Sep 4 2017 5:07 AM

వీక్లీ ఆఫ్!

వీక్లీ ఆఫ్!

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గస్తీలో ఉండే పోలీసు సిబ్బందికి ఇక వీక్లీఆఫ్ వర్తింప చేస్తూ...

సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గస్తీలో ఉండే పోలీసు సిబ్బందికి ఇక వీక్లీఆఫ్ వర్తింప చేస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో పుదుచ్చేరి పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర కీలకం. విమర్శలు, ఆరోపణలు ఉన్నా, పోలీసు యంత్రాంగం అన్నది లేకుంటే, పరిస్థితి ఆగమ్య గోచరమే. పోలీసులకు సెలవులు తక్కువే. నిత్యం విధుల్లో ఉంటూ ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు ప్రప్రథమంగా వారంలో ఓ రోజు సెలవు దొరికిన పక్షంలో ఆనంద తాండవమే.

ఓ రోజు సెలవు దొరికితే చాలు, పోలీసుల కుటుంబాల్లోనూ ఆనందం వికసిస్తుంది. సెలవుల కోసం, పనిభారంతో అనేక చోట్ల పోలీసులు సతమతం అవుతూ వస్తుంటే, ప్రప్రథమంగా వీక్లీఆఫ్ ఇవ్వడానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయమే.
 
వీక్లీ ఆఫ్ :
మాజీ ఐపీఎస్ అధికారిణిగా పోలీసుల కష్టాల్ని కిరణ్ బేడీ ప్రత్యక్షంగా తిలకించారన్నది జగమెరిగిన సత్యం. ఐపీఎస్ అధికారిణిగా, రాజకీయ నాయకురాలిగా అవతరించి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కిరణ్‌బేడీ ప్రజలు, అధికారుల నుంచి మంచి మార్కుల్నే కొట్టేస్తున్నారు. ప్రజాహితం లక్ష్యంగా పుదుచ్చేరిలో దూసుకెళుతున్న కిరణ్ బేడీ, అందరి మన్ననలు అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

తన సంస్కరణలతో అధికార వర్గాల్లో మార్పులు తీసుకొచ్చిన కిరణ్ బేడి , ప్రస్తుతం ప్రజల్లో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు ఒకప్పుడు అధ్వానంగా ఉన్నాయి. కిరణ్ రాకతో కొంత మేరకు మెరుగు పడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసుల కష్టాల్ని గుర్తించిన ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వారంలో ఓ రోజు సెలవు తీసుకునేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు.

పోలీసుల సేవల్ని ప్రశంసిస్తూ పుదుచ్చేరిలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గస్తీ సిబ్బందిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆమె కొనియాడారు. డీజీపీ ఆదేశిస్తే, వారంలో ఓ రోజు గస్తీ సిబ్బందికి సెలవులు ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. గస్తీ సిబ్బంది తమ తమ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతల పర్యవేక్షణలో గానీయండి, నేరగాళ్ల కదలికల్ని గుర్తించడంలో గానీ వారి కృషి అభినందనీయమని వ్యాఖ్యలు చేశారు.

ఇంతలో వేదిక మీదున్న డీజీపీ సునీల్‌కుమార్ గస్తీ సిబ్బంది వారంలో ఓరోజు సెలవు ఇచ్చేందుకు సిద్ధం అని, ప్రకటించడంతో అందుకు కిరణ్ బేడి ఆమోదముద్ర వేయడం విశేషం. అయితే, ఈ వీక్లీ ఆఫ్ అన్నది అందరికీ ఒకే సారిగా ఇవ్వలేం అని, కొందరికి ఓ రోజు, మరి కొందరికి మరో రోజు అన్నట్టుగా వంతుల వారీగా కొనసాగిస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ వీక్లీఆఫ్ అన్నది గస్తీ సిబ్బందికి మాత్రమేనని, తదుపరి అందరికీ వర్తింపచేయడానికి తగ్గ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement