పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు | 77 per cent of road accidents in India due to drunken driving | Sakshi
Sakshi News home page

పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు

May 12 2014 10:46 PM | Updated on May 25 2018 2:06 PM

మందుబాబులం మేం మందుబాబులం, మందుకొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టుగా ఉంది ఢిల్లీ యువత పరిస్థితి. 18 సంవత్సరాలు నిండక ముందే నగరంలో 83.8 శాతం మంది బాలురు, 64.6 శాతం

న్యూఢిల్లీ: మందుబాబులం మేం మందుబాబులం, మందుకొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టుగా ఉంది ఢిల్లీ యువత పరిస్థితి. 18 సంవత్సరాలు నిండక ముందే నగరంలో 83.8 శాతం మంది బాలురు, 64.6 శాతం మంది బాలికలు మద్యం సేవిస్తున్నారు. 11.1 శాతం మంది బాలురు, 2.1 శాతం మంది బాలికలు మద్యం కోసం నెలకు రూ.ఎనిమిది వేల వరకు ఖర్చు పెడుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం క్యాంపెయిన్ అగెనైస్ట్ డ్రంకన్ డ్రైవింగ్(సీఏడీడీ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం జరుగుతున్న యూఎన్ గ్లోబల్ రోడ్డు సేఫ్టీ వీక్ పేరిట నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాలతో ఆల్కహల్ అండ్ యూత్ సర్వే నివేదిక-2014ని విడుదల చేసింది. ఢిల్లీ యువతలో 34.5 శాతం మంది యువకులు, 28 శాతం మంది యువతులు వారానికి కనీసం రెండు నుంచి నాలుగుసార్లు మద్యం సేవిస్తున్నట్టు వెల్లడించారు.
 
 ఒకేసారి ఐదు కంటే ఎక్కువసార్లు మద్యాన్ని 77 శాతం మంది బాలురు, 46 శాతం మంది బాలికలు తీసుకుంటున్నట్టు సర్వేలో తేలింది. ‘ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం యువత మృతి చెందుతున్నారు. పబ్‌లకు భారీ సంఖ్యలో యువత వెళుతోంది. అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉండటంతో ఇష్టమొచ్చినంత మద్యాన్ని సేవిస్తున్నారు. డబ్బులు సులభంగానే రావడం, మద్యం ఎక్కడబడితే అక్కడ దొరకడంతో యువత పెడదారిన పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయా మద్యం కంపెనీలు కూడా విపరీతమైన పబ్లిసిటీ చేస్తుండటంతో ఆల్కహాల్ పట్ల ఆకర్షితులవుతున్నార’ని సీఏడీడీ వ్యవస్థాపకుడు ప్రిన్స్ సింఘాల్ వెల్లడించారు. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడపడం వల్లే జరిగినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
 
 ఈ విషయం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనికి చెక్ పెట్టాలంటే డ్రంకెన్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించాలని తెలిపారు. ఇందులో తల్లిదండ్రులు, ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు, వివిధ సంస్థలు భాగస్వామ్యం కావాలని సింఘాల్ పిలుపునిచ్చారు. 75 శాతం మంది యువకులు, 12.3 శాతం మంది యువతులు డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తేలింది. ఆల్కహాల్ కొనుగోలు చేసే ముందు, సేవించే ముందు యజమానులు వయసు వివరాలను అడగడం లేదని ప్రతివాదులు చెప్పారన్నారు. ‘పోలీసు వ్యవస్థ చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని 67.5 శాతం మంది ప్రతివాదులు భావిస్తున్నారు.
 
 యువత మద్యం తాగే సమయంలో బార్‌లు, పబ్‌ల ప్రాంగణంలో ఏ ఒక్క పోలీసు ఉండటం లేదని తెలిపారు. ఉదయం 12 నుంచి రెండు గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయడం లేదు. ఈ సమయంలో మద్యం సేవించిన యువత పబ్‌ల నుంచి మితిమీరిన వేగంతో రోడ్లపై వెళుతున్నార’ని సర్వేలో తేలిందన్నారు. యూనివర్సిటీ, క్యాంపస్ ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వహించడం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న యువత కారు, హాస్టల్, చిన్న రెస్ట్రోబార్‌లతో పాటు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవిస్తోందని సదరు నివేదిక ద్వారా తెలిసింది.
 
 యువతను చైతన్యపరచాలి
 మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి యువతలో చైతన్యం కలిగించాలని సీఏడీడీ వ్యవస్థాపకుడు ప్రిన్స్ సింఘాల్ తెలిపారు. మద్యానికి బానిసవడం వల్ల ఇటు విద్యతో పాటు అటు అందమైన భవిష్యత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకుని బార్‌లు, పబ్‌లకు వెళుతున్న యువత  వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్  డ్రైవ్‌లో అనేక మంది యువత పట్టుబడుతున్నారు. వీరిపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని సింఘాల్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement