breaking news
cadd
-
పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు
న్యూఢిల్లీ: మందుబాబులం మేం మందుబాబులం, మందుకొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టుగా ఉంది ఢిల్లీ యువత పరిస్థితి. 18 సంవత్సరాలు నిండక ముందే నగరంలో 83.8 శాతం మంది బాలురు, 64.6 శాతం మంది బాలికలు మద్యం సేవిస్తున్నారు. 11.1 శాతం మంది బాలురు, 2.1 శాతం మంది బాలికలు మద్యం కోసం నెలకు రూ.ఎనిమిది వేల వరకు ఖర్చు పెడుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం క్యాంపెయిన్ అగెనైస్ట్ డ్రంకన్ డ్రైవింగ్(సీఏడీడీ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం జరుగుతున్న యూఎన్ గ్లోబల్ రోడ్డు సేఫ్టీ వీక్ పేరిట నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాలతో ఆల్కహల్ అండ్ యూత్ సర్వే నివేదిక-2014ని విడుదల చేసింది. ఢిల్లీ యువతలో 34.5 శాతం మంది యువకులు, 28 శాతం మంది యువతులు వారానికి కనీసం రెండు నుంచి నాలుగుసార్లు మద్యం సేవిస్తున్నట్టు వెల్లడించారు. ఒకేసారి ఐదు కంటే ఎక్కువసార్లు మద్యాన్ని 77 శాతం మంది బాలురు, 46 శాతం మంది బాలికలు తీసుకుంటున్నట్టు సర్వేలో తేలింది. ‘ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం యువత మృతి చెందుతున్నారు. పబ్‌లకు భారీ సంఖ్యలో యువత వెళుతోంది. అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉండటంతో ఇష్టమొచ్చినంత మద్యాన్ని సేవిస్తున్నారు. డబ్బులు సులభంగానే రావడం, మద్యం ఎక్కడబడితే అక్కడ దొరకడంతో యువత పెడదారిన పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయా మద్యం కంపెనీలు కూడా విపరీతమైన పబ్లిసిటీ చేస్తుండటంతో ఆల్కహాల్ పట్ల ఆకర్షితులవుతున్నార’ని సీఏడీడీ వ్యవస్థాపకుడు ప్రిన్స్ సింఘాల్ వెల్లడించారు. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడపడం వల్లే జరిగినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ విషయం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనికి చెక్ పెట్టాలంటే డ్రంకెన్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించాలని తెలిపారు. ఇందులో తల్లిదండ్రులు, ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు, వివిధ సంస్థలు భాగస్వామ్యం కావాలని సింఘాల్ పిలుపునిచ్చారు. 75 శాతం మంది యువకులు, 12.3 శాతం మంది యువతులు డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తేలింది. ఆల్కహాల్ కొనుగోలు చేసే ముందు, సేవించే ముందు యజమానులు వయసు వివరాలను అడగడం లేదని ప్రతివాదులు చెప్పారన్నారు. ‘పోలీసు వ్యవస్థ చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని 67.5 శాతం మంది ప్రతివాదులు భావిస్తున్నారు. యువత మద్యం తాగే సమయంలో బార్లు, పబ్‌ల ప్రాంగణంలో ఏ ఒక్క పోలీసు ఉండటం లేదని తెలిపారు. ఉదయం 12 నుంచి రెండు గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయడం లేదు. ఈ సమయంలో మద్యం సేవించిన యువత పబ్‌ల నుంచి మితిమీరిన వేగంతో రోడ్లపై వెళుతున్నార’ని సర్వేలో తేలిందన్నారు. యూనివర్సిటీ, క్యాంపస్ ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వహించడం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న యువత కారు, హాస్టల్, చిన్న రెస్ట్రోబార్లతో పాటు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవిస్తోందని సదరు నివేదిక ద్వారా తెలిసింది. యువతను చైతన్యపరచాలి మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి యువతలో చైతన్యం కలిగించాలని సీఏడీడీ వ్యవస్థాపకుడు ప్రిన్స్ సింఘాల్ తెలిపారు. మద్యానికి బానిసవడం వల్ల ఇటు విద్యతో పాటు అటు అందమైన భవిష్యత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకుని బార్లు, పబ్‌లకు వెళుతున్న యువత వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్‌లో అనేక మంది యువత పట్టుబడుతున్నారు. వీరిపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని సింఘాల్ సూచించారు. -
క్యూ2లో లోటు తగ్గిందోచ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో (2013-14, జూలై-సెప్టెంబర్) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్) భారీగా తగ్గింది. ఈ క్వార్టర్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.2 శాతంగా నమోదయ్యింది. విలువ పరంగా ఇది 5.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో 21 బిలియన్ డాలర్లు (జీడీపీలో 5 శాతం). ఎగుమతులు మెరుగుపడడం, బంగారం దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. క్యాడ్ అంటే క్యాడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 56 బిలియన్ డాలర్ల వరకూ తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) అంచనావేస్తోంది. బంగారం దిగుమతులు భారీగా తగ్గుతుండడం దీనికి ప్రధానంగా దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు ఎగుమతులు పెరుగుదల, ఇది వాణిజ్యలోటు తగ్గడానికి దారితీస్తున్న సానుకూల ధోరణి సైతం ఇందుకు దోహదపడుతుందని భావిస్తోంది. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్ఐఐ(విదేశీ సంస్థాగత పెట్టుబడులు), ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు), ఈసీబీ(విదేశీ వాణిజ్య రుణాలు) మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). క్యాడ్‌ను ప్రధానంగా ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల ద్వారా ఫైనాన్స్ చేస్తారు. ఒకవేళ ఈ నిధులు సరిపోకపోతే మొత్తం దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను ముట్టుకోవాల్సి ఉంటుంది. క్యాడ్ భారీగా తగ్గడం స్థూల ఆర్థికాంశాలకు ప్రోత్సాహకర అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. బంగారంపై చర్యల ఫలితం! క్యాడ్ కట్టడికి బంగారం దిగుమతి సుంకాన్ని 10% వరకూ కేంద్రం పెంచింది. నాణేలు, కడ్డీల దిగుమతులను నిషేధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. దేశం పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 41 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. సుంకాల పెంపు కారణంగా దేశీయంగా భారీగా ఉన్న రేట్లు సైతం బంగారం డిమాండ్ పడిపోడానికి కారణమవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా.