వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌  | World Test Championship Begins With Ashes Series | Sakshi
Sakshi News home page

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

Jul 31 2019 1:29 AM | Updated on Jul 31 2019 5:03 AM

World Test Championship Begins With Ashes Series - Sakshi

44 ఏళ్లలో 12 వన్డే ప్రపంచ కప్‌లను చూశాం! 12 ఏళ్లలో 6 టి20 ప్రపంచ కప్‌ల మజా ఆస్వాదించాం! ఈ ఫార్మాట్లలో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు చాంపియన్లయ్యారో చెప్పగలం! మరి... సంప్రదాయ టెస్టుల్లో జగజ్జేత ఎవరంటే?  కనీసం ఆ హోదాకు తగిన జట్టేదంటే? ఇంతకాలం ‘వీరు’ అని చూపలేని పరిస్థితి! మున్ముందు మాత్రం ఈ ఇబ్బంది ఉండదు!  కారణం... రాబోయే ‘టెస్టు చాంపియన్‌షిప్‌’!  ఐదు రోజుల ఫార్మాట్‌లో ప్రపంచ విజేతను తేల్చేందుకు  ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌తో దీనికి రేపటి నుంచి తెరలేవనుంది.

సంప్రదాయ ఫార్మాట్‌లో శతాబ్దంపైగా చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌. టెస్టు క్రికెట్‌కు అమిత ప్రాధాన్యమిచ్చే ఈ దేశాల మధ్య గురువారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)నకు తెరలేవనుంది. సమయం, విస్తృతి దృష్ట్యా బహుళ దేశాల టోర్నీ తరహాలో కాకుండా... ముఖాముఖి సిరీస్‌ల ద్వారానే పాయింట్లు కేటాయించి టెస్టు జగజ్జేత ఎవరో తేల్చనున్నారు. ఇందుకోసం మొత్తం 9 దేశాలు పోటీలో ఉండగా, 27 సిరీస్‌లలో భాగంగా వీటి మధ్య రెండేళ్ల వ్యవధిలో 71 టెస్టులు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ప్రతి జట్టు ఇంటా, బయటా మూడేసి సిరీస్‌లు ఆడుతుంది. నిర్ణీత గడువు (2021 జూన్‌) వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్‌ వేదికగా ఫైనల్‌ (72వ టెస్టు) ఆడతాయి. 

రెండు నుంచి ఐదు.... 
చాంపియన్‌షిప్‌లోని సిరీస్‌లలో కనిష్టంగా రెండు, గరిష్టంగా ఐదు టెస్టులున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే చాంపియన్‌షిప్‌ (ఆగస్ట్‌ 2019–మార్చి 2021)ను మొదటి దశగా పేర్కొంటున్నారు. రెండో అంచెను జూన్‌ 2021–ఏప్రిల్‌ 2023 మధ్య నిర్వహించే ప్రణాళికలున్నాయి. తొలి అంచెలో డే–నైట్‌ టెస్టులు సహా ఐదు రోజుల టెస్టులకే చోటిచ్చారు.  

సిరీస్‌కు 120 పాయింట్లు... 
ప్రతి సిరీస్‌కు 120 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు. సిరీస్‌లోని టెస్టుల సంఖ్యకు తగ్గట్లు ఈ పాయింట్లను విభజిస్తారు. ఉదాహరణకు భారత్‌–వెస్టిండీస్‌ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో విజేత జట్టుకు టెస్టుకు గరిష్టంగా 60 వంతున పాయింట్లు లభిస్తాయి. ఈ విధానం ఎలాగంటే.. 

ఐసీసీ పర్యవేక్షణ... 
చాంపియన్‌షిప్‌లో భాగమైనప్పటికీ సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌ల తరహాలోనే మ్యాచ్‌ వేదికలు, ప్రసారం, టిక్కెట్లు తదితరాలన్నీ ఆతిథ్య దేశ బాధ్యతలే. మ్యాచ్‌ అధికారులను సమకూరుస్తూ, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా అని గమనిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. టెస్టు మ్యాచ్‌ల ప్రసార హక్కులూ ఆతిథ్య బోర్డువే. ఫైనల్‌ ప్రసార హక్కులను మాత్రం ఐసీసీ అట్టిపెట్టుకుంది. 

ఆ మ్యాచ్‌లు లెక్కలోకి రావు... 
టాప్‌–9 (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌) జట్ల మధ్య జరిగే సిరీస్‌లే డబ్ల్యూటీసీ పరిధిలోకి వస్తాయి. టెస్టు హోదా ఉన్నప్పటికీ అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌లను చాంపియన్‌షిప్‌లో భాగంగా చూడటం లేదు. అలాగే... డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికకు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌కు సంబంధం లేదు. 

ఇంగ్లండ్‌ 22... లంక, పాక్‌ 13... 
చాంపియన్‌షిప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడనున్నది ఇంగ్లండ్‌ (22). ఆస్ట్రేలియా (19), భారత్‌ (18) దాని తర్వాత ఎక్కువ టెస్టులు ఆడతాయి. శ్రీలంక, పాకిస్తాన్‌లకు తక్కువగా 13 మ్యాచ్‌లు మాత్రమే ఆడే వీలుచిక్కింది. టోర్నీలో ఈ రెండు జట్లతో భారత్‌కు సిరీస్‌లు లేకపోవడం గమనార్హం. భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో ఉన్నప్పటికీ వన్డే ప్రపంచకప్‌ ఫైనలిస్టులు ఇంగ్లండ్‌–న్యూజిలాండ్‌ మధ్య నవంబరులో జరిగే టెస్టు సిరీస్‌ డబ్ల్యూటీసీలో భాగం కాకపోవడం విశేషం.  

స్లో ఓవర్‌ రేట్‌ ఉంది... 
ఐసీసీ తాజాగా తెచ్చిన నిబంధన ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌కు జట్టు పాయింట్లలో కోత పడుతుంది. ఒక ఓవర్‌ తక్కువ వేస్తే జట్టుకు రెండు పాయింట్లు కట్‌ చేస్తారు.  

ఫైనల్‌ డ్రా అయితే... 
రెండేళ్ల అనంతరం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ ‘డ్రా’ అయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. రిజర్వ్‌ డే ఉన్నప్పటికీ ఐదు రోజుల ఆటలో నెట్‌ ప్లేయింగ్‌ టైమ్‌ (రోజుకు ఆరు గంటలు) నష్టపోతేనే దానిని వర్తింపజేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement