భారత అభిమానులకు ఓపికుండదు: వివ్‌ రిచర్డ్స్‌

Viv Richards Says Indian Fans Lack a Bit of Patience - Sakshi

లండన్‌ : భారత అభిమానులకు కొంచెం కూడా ఓపిక ఉండదని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ అభిప్రాపడ్డాడు. వారనుకున్న ఫలితం రాకుంటే పిచ్చిగా అభిమానించే ఆటగాళ్ల దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెడతారో ఇప్పటికి అర్థం కాదన్నాడు. ప్రపంచకప్‌లో కోహ్లిసేన బాగా రాణించాలంటే భారత అభిమానులు ఓపికలతో ఉండాలని సూచించాడు. సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత అభిమానులకు కొన్నిసార్లు ఓపిక ఉండదు. దిష్టిబొమ్మలను తగలబెట్టడం తెలివితక్కువ పని. ఏ ఆటగాడికైనా ఓడిపోవాలని ఉండదు. గెలవడానికే ప్రయత్నిస్తారు. ఈ రోజు హీరో కాకపోయినంత మాత్రానా రేపు జీరో కాదు. ప్రత ఒక్కరి పట్ల గౌరవంగా, మర్యాదకంగా నడుచుకోవాలి. అన్నిసార్లు మనకే మంచి జరగాలంటే కుదురదు’ అని రిచర్డ్స్‌ చెప్పుకొచ్చాడు.

సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగానే భారత అభిమానులు ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఇక 2007 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ నుంచే నిష్క్రమించడంతో కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. క్రికెటర్ల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో తీవ్రంగా కుంగిపోయిన సచిన్‌ రిచర్డ్స్‌ ఫోన్‌కాల్‌తోనే తేరుకొని మరో నాలుగేళ్లు క్రికెట్‌ ఆడానని ఈ కార్యక్రమంలోనే వెల్లడించాడు. ‘ 2007 ప్రపంచకప్‌లోని నా ప్రదర్శన కెరీర్‌లోని అత్యంత చెత్త ప్రదర్శన. ఈ ఓటమితో ఆటకు గుడ్‌బై చెప్పుదాం అనుకున్నా. ఆ సమయంలో మా అన్న 2011లో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతావని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా నేను కన్వీన్స్‌ కాలేదు. నేను ఫామ్‌హౌస్‌లో ఉండగా వివ్‌ రిచర్డ్స్‌ ఫోన్‌ చేశాడు. సుమారు 45 నిమిషాలు మాట్లాడాడు. ఆ కాల్‌తో నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నా’ అని  సచిన్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top