అంపైర్‌ నిద్రపోయావా ఏంటి?

Umpire Nandan Was Involved In Making An Unusual Decision In Irani Cup - Sakshi

నాగ్‌పూర్‌: క్రికెట్‌లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్‌ సీకే నందన్‌ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్‌ ఇండియా-విదర్భ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ అంపైర్‌ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. 

ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్‌ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్‌ మరో ఫీల్డ్ అంపైర్‌ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్‌ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. అంపైర్‌ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి‌’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు.    
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top