సైనా, సింధులకు పరీక్ష | Test for saina and sindhu | Sakshi
Sakshi News home page

సైనా, సింధులకు పరీక్ష

Oct 15 2014 12:59 AM | Updated on Sep 2 2017 2:50 PM

సైనా, సింధులకు పరీక్ష

సైనా, సింధులకు పరీక్ష

ఒడెన్స్: సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్

 ఒడెన్స్: సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన దీర్ఘకాల కోచ్ పుల్లెల గోపీచంద్‌కు వీడ్కోలు పలికి బెంగళూరులో మరో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందుతోన్న సైనాకు ఈ టోర్నీ ఎంతో కీలకంకానుంది. మరోవైపు అద్భుత నైపుణ్యం ఉన్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న సింధుకు కూడా ఈ టోర్నీ సవాలుగా నిలువనుంది.

వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు గతేడాది ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 2012లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సైనా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచి మిగతా టోర్నీలలో నిరాశ పరిచింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో కరీన్ షానాస్ (జర్మనీ)తో సైనా; పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో సింధు తలపడతారు.

 పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ ఇంగ్లండ్‌కు చెందిన రాజీవ్ ఉసెఫ్‌తో; జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ పోటీపడతారు. వాస్తవానికి తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో శ్రీకాంత్ ఆడాలి. అయితే లీ చోంగ్ వీ వైదొలగడంతో అతని స్థానాన్ని జుయ్ సాంగ్‌తో భర్తీ చేశారు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగాల్సినప్పటికీ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

 మెయిన్ ‘డ్రా’కు అశ్విని-ఇవనోవ్ జోడీ
 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో అశ్విని-ఇవనోవ్ 21-13, 21-17తో క్రిస్టియాన్సన్-లీనా గ్రెబెక్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement