
సూపర్ స్టెయిన్
లక్ష్యం 6 బంతుల్లో 7 పరుగులు... చేతిలో 5 వికెట్లు... క్రీజ్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్... టి20ల్లో ఇలాంటి స్థితిలో ఏ జట్టుకైనా లక్ష్యాన్ని ఛేదించడం సులభమే.
ఆఖరి ఓవర్‌లో అద్భుతం
2 పరుగులతో దక్షిణాఫ్రికా సంచలన విజయం
చివర్లో చతికిలపడ్డ కివీస్ టి20 ప్రపంచకప్
లక్ష్యం 6 బంతుల్లో 7 పరుగులు... చేతిలో 5 వికెట్లు... క్రీజ్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్... టి20ల్లో ఇలాంటి స్థితిలో ఏ జట్టుకైనా లక్ష్యాన్ని ఛేదించడం సులభమే. కానీ వరల్డ్ నంబర్‌వన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ఈ సమీకరణాన్ని మొత్తం మార్చేశాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఆరు బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు కూడా పంపించాడు. న్యూజిలాండ్ ఆశలను అడియాసలు చేస్తూ దక్షిణాఫ్రికాకు రెండు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందించాడు. టి20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచాడు.
చిట్టగాంగ్: ‘వారెవ్వా... ఏమి మ్యాచ్’ టి20 ప్రపంచకప్‌లో సోమవారం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసిన వారెవరైనా వెలిబుచ్చే అభిప్రాయమిది. ఆఖరి ఓవర్‌లో కివీస్ విజయానికి ఏడు పరుగులే కావాలి. క్రీజ్‌లో ఊపు మీదున్న రాస్ టేలర్ (37 బంతుల్లో 62; 4 ఫోర్లు; 3 సిక్స్) ఉన్నాడు. అసలు పొట్టి ఫార్మాట్‌లో ఈ స్కోరును రెండు బంతుల్లో ముగించొచ్చు. కానీ సూపర్ స్టెయిన్ తన బుల్లెట్ బంతులతో అద్భుతాన్నే సృష్టించాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ముగ్గురిని పెవిలియన్ పంపించి సంభ్రమాశ్చర్యంలో ముంచాడు. స్టెయిన్ అద్భుత విన్యాసం ఫలితంగా జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో సఫారీ 2 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. డుమిని (43 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు; 3 సిక్స్‌లు), ఆమ్లా (40 బంతుల్లో 41; 2 ఫోర్లు) మాత్రమే రాణించారు. సౌతీ, అండర్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. 42 పరుగులకు మూడు వికెట్లు పడినా ఆమ్లాతో కలిసి డుమిని ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జత చేరాయి. చివర్లో డుమిని రెచ్చిపోవడంతో ఐదు ఓవర్లలోనే 70 పరుగులు వచ్చాయి.
స్టెయిన్ మ్యాజిక్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసి ఓడింది. టేలర్‌తో పాటు విలియమ్సన్ (35 బంతుల్లో 51; 5 ఫోర్లు; 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరును కూడా సాధించలేకపోయారు. ఆరంభం నుంచే కివీస్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. విలియమ్సన్‌కు జతగా టేలర్ కలవడంతో గెలుపు ఖాయమే అనిపించింది. 14వ ఓవర్‌లో విలియమ్సన్ ఔటైనా క్రీజులో టేలర్ ఉండడంతో కివీస్ ఆశలు పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగానే చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేస్తే చాలు. 19వ ఓవర్ వరకు పరిస్థితులు కివీస్‌కు అనుకూలమే. అయితే 20వ ఓవర్‌లో స్టెయిన్ ఊహించని షాక్ ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.
చివరి ఓవర్ సాగిందిలా... (లక్ష్యం: ఆరు బంతుల్లో ఏడు పరుగులు)
తొలి బంతి: ఫుల్ టాస్ బంతిని రోంచి ఆఫ్‌సైడ్ ఆడగా కీపర్ డికాక్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
రెండో బంతి: నాథన్ మెకల్లమ్ షాట్ ఆడేందుకు యత్నించినా బంతి బ్యాట్‌కు తగల్లేదు
మూడో బంతి: మరో డాట్ బాల్. లెగ్ సైడ్ ఆడడంలో విఫలమయ్యాడు.
నాలుగో బంతి: ఈసారి నాథన్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్ బాదాడు.
ఐదో బంతి: వైడ్ బంతిని నాథన్ మెకల్లమ్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా షాట్ ఆడి డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆరో బంతి: ఊపు మీదున్న టేలర్‌కు ఆడే అవకాశం చిక్కిన బంతి ఇది. మూడు పరుగులు చేస్తే చాలు. కనీసం రెండు పరుగులు చేసినా మ్యాచ్ టై అయ్యేది. కానీ అవుట్ సైడ్ ఆఫ్ బంతిని నేరుగా స్టెయిన్ వద్దకు ఆడి పరుగెత్తాడు. బంతి అందుకున్న స్టెయిన్ తడబాటు లేకుండా టేలర్‌ను రనౌట్ చేశాడు.