రెండేళ్ల తర్వాత... 

Sri Lanka v England: England complete 211 run win to end losing  - Sakshi

 విదేశీ గడ్డపై ఇంగ్లండ్‌ టెస్టు విజయం  

211 పరుగులతో శ్రీలంక చిత్తు  

గాలే: శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ గెలుచుకోవడంతో పాటు ఏకైక టి20లో కూడా విజయం సాధించిన ఇంగ్లండ్‌ టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. 462 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకే ఆలౌటైంది. మాథ్యూస్‌ (92 బంతుల్లో 53; 5 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (77 బంతుల్లో 45; 6 ఫోర్లు, సిక్స్‌), కౌశల్‌ సిల్వ (30), పెరీరా (30; 3 ఫోర్లు, సిక్స్‌) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు.

ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌ అలీ 4, జాక్‌ లీచ్‌ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారుగత 14 విదేశీ టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. 2016 అక్టోబర్‌లో చిట్టగాంగ్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై గెలుపొందిన తర్వాత విదేశీ గడ్డపై 13 టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌ పదింటిలో ఓడి... మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన బెన్‌ ఫోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టెస్టు ఈ నెల 14 నుంచి కాండీలో జరుగుతుంది.  

హెరాత్‌ వీడ్కోలు... 
గాలే టెస్టుతో శ్రీలంక సీనియర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ హెరాత్‌ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. చివరి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన హెరాత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. 93 టెస్టుల్లో 28.07 సగటుతో హెరాత్‌ 433 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానంతో కెరీర్‌ ముగించాడు.   

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top