తై జుకు సింధు చెక్‌

Sindhu won the Tai tzu ying Rio Olympics pre quarter finals - Sakshi

ప్రపంచ నంబర్‌వన్‌పై గెలుపు 

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ 

రియో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తై జు యింగ్‌పై సింధు విజయం సాధించింది... అంతే ఆ తర్వాత ఆమెను ఈ చైనీస్‌ తైపీ ప్రత్యర్థి వెంటాడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సార్లు తై జు ముందు సింధు తలవంచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు మార్చినా తెలుగమ్మాయికి విజయం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు ఆమె ప్రత్యర్థి అడ్డుగోడను ఛేదించింది. అద్భుత ప్రదర్శనతో తై జును ఓడించి పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేసింది. తొలి గేమ్‌ను కోల్పోయినా ఆ తర్వాత సింధు కోలుకున్నతీరు అసమానం.  

గ్వాంగ్‌జౌ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు ప్రపంచ నంబర్‌వన్‌ తైజు యింగ్‌ సవాల్‌ను ఛేదించింది. తనకు పదేపదే పరాజయాన్ని చవిచూపిస్తున్న చైనీస్‌ తైపీ ప్రత్యర్థిని కసిదీరా ఓడించింది. సీజన్‌ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్‌ ఈవెంటైన వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో గ్రూప్‌ ‘ఎ’ మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో తెలుగుతేజం, ఒలింపిక్‌ రన్నరప్‌ సింధు 14–21, 21–16, 21–18తో తై జును కంగుతినిపించింది. తొలి గేమ్‌లో ప్రతికూల ఫలితం వచ్చినా... తర్వాత గేముల్లో పట్టుదలతో ఆడింది. చివరి దాకా పట్టుసడలించకుండా ఆడిన సింధు 2–1 గేమ్‌లతో ప్రత్యర్థిని ఓడించింది. మొదటి 16 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో తై జు జోరే కనబడింది. అనవసర తప్పిదాలతో పాటు విన్నర్స్‌ కొట్టడంలో విఫలమైన సింధు 2–6తో వెనుకబడింది. స్మాష్‌లు, రిటర్న్‌ షాట్లతో తై జు తన ఆధిక్యాన్ని 17–12కు పెంచుకుంది. కాసేపటికే మరో నాలుగు పాయింట్లు సాధించిన తైపీ నంబర్‌వన్‌ తొలి గేమ్‌ను 21–14తో ముగించింది.

ఇక రెండో గేమ్‌లో మాత్రం సింధు జాగ్రత్తగా ఆడింది. గేమ్‌ మొదలైన కాసేపటికే 6–3తో తన ఆధిపత్యాన్ని చాటింది. సుదీర్ఘ ర్యాలిలో మరింత దూకుడు కనబర్చిన సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడింది. చూస్తుండగానే 11–6కు చేరిన ఆమె... ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్‌ ను చేజిక్కించుకునేదాకా చెమటోడ్చింది. 19–13 స్కోరుకు చేరాక సింధు ఈ గేమ్‌ను క్షణాల వ్యవధిలోనే తన వశం చేసు కుంది. చివరి గేమ్‌లో మొదట 0–3తో వెనుకబడిన భారత స్టార్‌ మ్యాచ్‌ సాగుతున్న కొద్ది టచ్‌లోకి వచ్చింది. 11–12 స్కోరుతో ప్రత్యర్థిని నిలువరించిన ఆమె క్రాస్‌ కోర్టు రిటర్న్‌ షాట్లతో తై జు యింగ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి గేమ్‌ తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’ పోరులో సమీర్‌ వర్మ 21–16, 21–7తో వరుస గేముల్లో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top