‘రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా’

Senior journalist Rajat Sharma Resigned as DDCA President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)  అధ్యక్ష పదవికి సీనియర్‌ జర్నలిస్టు రజత్‌ శర్మ రాజీనామా చేశారు. అతడి రాజీనామాను డీడీసీఏ  సీఈఓ, సీఏసీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్‌ తిహారాతో రజత్‌ శర్మకు పొసగటం లేదు.  అరుణ్‌ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్‌ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇక రజత్‌ శర్మ రాజీనామా తర్వాత సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అతుల్‌ వాసన్‌, కోచ్‌ కేపీ భాస్కర్‌ల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది.  

‘డీడీసీఏలో అధిక​ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కొంత మంది క్రికెట్‌ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారు. డీడీసీఏ సమగ్రతను కాపాడుతూ నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలని భావించాను. కానీ డీడీసీఏ అలా ఉండటం సాధ్యపడటం లేదు. అయితే ఆ విషయాల్లో నేను రాజీ పడే ప్రసక్తే లేదు. దీంతో రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను’ అని రజత్‌ శర్మ పేర్కొన్నారు. ఇక రజత్‌ రాజీనామా అనంతరం వినోద్‌ తిహారా అధ్యక్షపదవి రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే బోర్డు ప్రవర్తనా నియమవాళిని ఉల్లఘించిన నేపథ్యంలో తిహారా సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే. రజత్‌ రాజీనామాతో తిహారా సస్పెన్షన్‌పై డిసెంబర్‌ 1న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో పునరాలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top