ఛేజింగ్‌లో రాస్‌ టేలర్‌ రికార్డుల మోత!

Ross Taylor Few Records While ODI Chasing Against england - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ (147 బంతుల్లో 181 నాటౌట్‌: 17 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కీలక ఛేజింగ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్‌ కీలక ఆటగాడు కొన్ని అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఓ వన్డే ఛేజింగ్‌ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడయ్యాడు టేలర్‌. దాంతోపాటుగా ఓ వన్డే ఛేజింగ్‌లో భాగంగా అత్యధిక ఇన్నింగ్స్‌ పరుగులు చేసిన కివీస్‌ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో మార్టిన్‌ గప్టిల్‌ (180 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును ఈ ఇన్నింగ్స్‌తో అధిగమించాడు. ఓవరాల్‌గా వన్డే ఛేజింగ్‌ ఇన్నింగ్స్‌ టాప్‌-3 ఆటగాళ్లుగా వరుసగా షేన్‌ వాట్సన్‌(185 నాటౌట్‌), ఎంఎస్‌ ధోని(183 నాటౌట్), విరాట్‌ కోహ్లి (183) ఉన్నారు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్‌ రెండో క్రికెటర్‌గా టేలర్‌ (7267 పరుగులు) నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. కివీస్‌ మాజీ క్రికెటర్‌ నాథన్‌ ఆస్టల్‌ (7090 పరుగులు) ను టేలర్‌ అధిగమించాడు. దీంతో కివీస్‌ నుంచి అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో టేలర్‌ రెండో స్థానంలో నిలవగా, ఆస్టల్‌ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు 7086 వన్డే పరుగులతో ఉన్న టేలర్‌.. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడి నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌కు అద్బుత విజయాన్ని అందించి అజేయంగా నిలిచాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై కివీస్‌ ఆటగాడు గప్టిల్‌ (180 నాటౌట్‌) సైతం అజేయంగా నిలవడం గమనార్హం. వన్డేల్లో కివీస్‌ నుంచి 8007 పరుగులతో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2-2 తో సమంగా ఉన్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్ ల సిరీస్‌ ఫలితం తేల్చే చివరి వన్డే శక్రవారం జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top