ధోని వద్దన్నాడు!

Rohit Sharma Signals Virat Kohli To Take DRS, MS Dhoni Overrules And Gets It Right Again - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్ఎస్) పద్ధతిని భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఉపయోగించినంతగా మరే ఇతర క్రికెటర్లు ఉపయోగించలేదనడంలో అతిశయోక్తి లేదేమో. వికెట్ల వెనుక చురగ్గా ఉండే ధోని.. నిర్ణయ పునఃసమీక్ష పద్ధతిని వినియోగించుకోవడంలో కూడా తనదైన ముద్రవేస్తున్నాడు. ధోని రివ్యూకు వెళ్దామంటే అది దాదాపు సక్సెస్‌ అవుతుంది. ఒకవేళ రివ్యూ వద్దు అంటే కూడా దానికి తిరుగుండదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో ఇదే రుజువైంది.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేసే సమయంలో బూమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాల్గో బంతి ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను తాకుతూ కీపర్‌ ధోని చేతుల్లోకి వెళ్లింది. అయితే అది బ్యాట్‌కు తగిలిందా.. ప్యాడ్‌ తగిలిందా అనే దానిపై సందిగ్థత నెలకొంది. దానికి ధోనితో పాటు భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్‌ చేయగా అంపైర్‌ తిరస్కరించాడు. అదే సమయంలో ఆ బంతి బ్యాట్‌కు తగల్లేదనేది ధోని ముఖంలో కనిపించింది. కాకపోతే రోహిత్‌ శర్మ రివ్యూకు వెళదామంటూ కెప్టెన్‌ కోహ్లికి సంకేతాలిచ్చాడు. దాంతో వెంటనే రివ్యూ వద్దని ధోని అడ్డంగా తల ఊపడంతో ఇక కోహ్లి ముందుకు వెళ్లలేదు. అయితే దాదాపు ఎక్కువ శాతం మంది భారత ఆటగాళ్లు కూడా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తాకిందనే భావించారు. కాకపోతే ఇక్కడ ధోని సక్సెస్‌ అయ్యాడు. ఆ బంతి బ్యాట్‌కు తగలేదనేది టీవీ రిప్లేలో తేలడంతో 'దటీజ్‌ ధోని' అనకోవడం మనవంతైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top