‘అందుకే ధోని- జాదవ్‌ స్లో బ్యాటింగ్‌’

Rohit Sharma Explains MS Dhoni Kedar Jadhav Reason Behind Slow Batting - Sakshi

వెనకేసుకొచ్చిన రోహిత్‌, కోహ్లి

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి భారత సీనియర్‌ ఆటగాళ్లు మహేంద్రసింగ్‌ ధోని- కేదార్‌ జాదవ్‌లే కారణమని అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాస్త కష్టపడితే అందుకోదగ్గ లక్ష్యం కళ్లెదుట ఉండగా ఈ సీనియర్లిద్దరూ తమ వల్ల కాదులే అన్నట్లు ఆడారని మండిపడ్డారు. మధ్య ఓవర్ల తరహాలో సింగిల్స్‌ తీస్తూ ఆగ్రహం తెప్పించారని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం ధోని-జాదవ్‌లను వెనకేసుకొచ్చారు. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యానే వారి బ్యాటింగ్‌ నెమ్మదిగా అనిపించిందని, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని రోహిత్‌ శర్మ తెలిపాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ ధోని, కేదార్‌ జాదవ్‌ భారీ షాట్ల కోసం ప్రయత్నించారు. కానీ స్లో పిచ్‌ కారణంగా సాధ్యం కాలేదు.  ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ మాత్రం ఇంగ్లండ్‌ ఆటగాళ్లకే ఇవ్వాలి. వారు పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధించారు.’ అని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. పంత్‌ ఎక్కడా ఎక్కడా? అని అందరు అడగారని, నెం4లో బ్యాటింగ్‌ వచ్చాడంటూ ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు రోహిత్‌ చమత్కరించాడు.

ఇక కోహ్లి మాట్లాడుతూ.. ‘బౌండరీల కోసం ధోని చాలా కష్టపడ్డాడు. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లు అవకాశం ఇవ్వకుండా బంతులు సంధించారు. జట్టుగా అంతా కూర్చొని మా తప్పులపై సమీక్ష జరుపుతాం. తదుపరి మ్యాచ్‌కు ప్రణాళికలు రచిస్తాం’ అని తెలిపాడు. ఓటమిపై స్పందిస్తూ.. ‘ప్రతి జట్టు ఓ మ్యాచ్‌ ఓడింది. ఎవరూ ఓటమిని కోరుకోరు. కానీ ప్రత్యర్థి జట్టు గొప్పగా ఆడినప్పుడు ఓటమిని అంగీకరించాల్సిందే. ప్రస్తుతం డ్రెస్సింగ్‌ రూమ్‌లో అందరి మూడ్‌ ఇలానే ఉంది. ఓటమి నుంచి కోలుకోవడం ఎలానో ఫ్రొఫెషనల్‌ ఆటగాళ్లుగా మాకు తెలుసు. ఈ మ్యాచ్‌లో టాస్‌ చాలా కీలక పాత్ర పోషించింది. బౌండరీ చాలా చిన్నగా 59 మీటర్లున్నట్లుంది. రివర్స్‌స్వీప్‌ షాట్స్‌ ఆడితే సిక్స్‌లు సాధ్యమయ్యేలా అనిపించింది. మరోవైపు 82 మీటర్లుంది. ఇంగ్లండ్‌ బౌలర్లు ఈ వ్యత్యాసాన్ని గుర్తించి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేశారు. ఇక వారి బ్యాటింగ్‌ చూసి ఓ దశలో 360 దాటుతుందనుకున్నా.. కానీ మేం వారికి అడ్డుకట్ట వేసాం. బెన్‌ స్టోక్స్‌ అద్భుతంగా ఆడాడు. మంచి ఆరంభం అందితే గెలుస్తామనుకున్నాం. కానీ అది కుదరలేదు. పంత్‌, పాండ్యా అద్భుతంగా ఆడారు. మొత్తానికి ఇంగ్లండ్‌ అన్నివిధాలుగా మాకంటే గొప్ప ప్రదర్శన కనబర్చింది’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. చదవండి: ధోని–జాదవ్‌ ఇంత చెత్తగానా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top