మాంకీ.. టెంపరరీ కెప్టెన్‌ వచ్చాడు: పంత్‌ స్లెడ్జింగ్‌

Rishabh Pant Targets Temporary Captain Tim Paine - Sakshi

టిమ్‌పైన్‌కు స్లెడ్జింగ్‌ రుచి చూపించిన పంత్‌  

మెల్‌బోర్న్‌ : స్లెడ్జింగ్‌ చేయడంలో తానేం తక్కువ కాదంటున్నాడు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో కమిన్స్‌కు మాటకు మాటతోనే బదులిచ్చిన ఈ యువ వికెట్‌ కీపర్‌ తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆ జట్టు కెప్టెన్‌ టీమ్‌పైన్‌కు అదే తరహాలో బుద్ది చెప్పాడు. ఇక మూడో రోజు ఆటలో టీమ్‌ పైన్‌ తన నోటి దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పదే పదే సూటి పోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. ‘ధోని వచ్చాడు కదా.. ఇప్పుడేం చేస్తావ్‌? వచ్చి బీబీఎల్‌ ఆడుతావా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కవ్వించాడు. పైన్‌ ఎంత రెచ్చగొట్టినా.. పంత్‌ మాత్రం సహనం కోల్పోకుండా తన ఆటను కొనసాగించాడు.

ఇదంతా మనసులో పెట్టుకున్న పంత్‌ అవకాశం కోసం ఎదురు చూసి సరైన రీతిలో బదులిచ్చాడు. నాలుగో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన పైన్‌పై మాటల దాడి చేసి.. తానేం తక్కువ కాదని ‘స్లెడ్జింగ్‌ నీకు ఒక్కడికే కాదు.. మాకు తెలుసు’ అన్నట్లు వ్యవహరించాడు. ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మయాంక్‌తో మాట్లాడుతూ.. ‘మాంకీ.. ఈ రోజు నీకు ఓ ముఖ్య అతిథి కనిపిస్తాడు. కమాన్‌ మాంకీ. ఎప్పుడైన, ఎక్కడైనా తాత్కలిక కెప్టెన్‌ అనే పదం విన్నావా? అతను ఔట్‌ అవ్వడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అతనికి మాట్లాడటం అంటే ఇష్టం. అదొక్కటే అతను చేయగలడు.’ అని సెటైరిక్‌గా వ్యాఖ్యానిస్తూ రెచ్చగొట్టాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్‌ మైక్స్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. టిమ్‌ పైన్‌ దురదృష్టమో.. ఏమో కానీ పంత్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

పంత్‌ స్లెడ్జింగ్‌ను భారత్‌ అభిమానులు సమర్ధిస్తున్నారు. యాక‌్షన్‌కు రియాక్షన్‌ ఉంటుందని, పైన్‌కు దిమ్మతిరిగినట్లుంటుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇక పంత్‌ స్లెడ్జింగ్‌పై టాలీవుడ్‌ హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. ఓ అభిమాని పోస్ట్‌కు బదులుగా ‘ఏదో మనసులో పెట్టుకున్నాడు. పాపం టిమ్‌.. క్యూట్‌గా అంపైర్‌కు ఫిర్యాదు చేసినట్టున్నాడు’ అని తన కామిక్‌ స్టైల్‌లో రిప్లే ఇచ్చాడు. 

చదవండి : పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్‌ పైన్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top