అందుకు కారణం ధోనినే: పంత్‌

Rishabh Pant Reveals Dhoni Role In His Success Secret - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా జట్టులో చోటు దక్కించకున్న యువ సంచలనం, డేర్‌డెవిల్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్‌లో, కీపింగ్‌లో సమూల మార్పులకు టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనియే కారణమని పేర్కొన్నాడు. జార్ఖండ్‌ డైనమెట్‌ చెప్పిన ఫార్ములాతోనే విజయాలు సాధిస్తున్నానని పంత్‌ వివరించాడు. 

‘కీపింగ్‌ చేస్తున్నప్పుడు నీ చేతులు, తల రెండింటి మధ్య సమన్వయం ఉండాలి.. అలాంటప్పుడే నీ శరీరం నీ ఆధీనంలో ఉంటుంది. ఎల్లప్పుడూ ఓపిక, ప్రశాంతతో ఉండాలి.  నిరంతరం సాధన మరువకూడదు.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో పాజిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండాలి. మ్యాచ్‌లో పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌ విధానం మార్చుకోవాలి. సమయానికి తగ్గట్లు గేమ్‌ ప్లాన్‌ ఛేంజ్‌ చేసుకోవాలి’ అంటూ ధోని సూచనలు చేశాడని పంత్‌ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ సారథి చెప్పిన ఫార్ములా పాటించే నిలకడగా విజయాలు సాధిస్తున్నానని ఈ డేర్‌డెవిల్స్‌ కీపర్‌ పేర్కొన్నాడు. ఏ సందేహం ఉన్నా ధోని భాయ్‌ని అడిగేస్తానని, ఐపీఎల్‌లో తనకు అవసరమైన ప్రతీ సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. 

2017లో టీ20లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన పంత్‌.. ఇప్పటివరకు నాలుగు టీ20లు ఆడి 24.33 సగటుతో 73 పరుగులు సాధించాడు. టీమిండియా-ఏ, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా పంత్‌ ఆటపట్ల, టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top