రైనా.. నువ్వు త్వరగా కోలుకోవాలి

Raina Undergoes Knee Surgery - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా మోకాలికి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఈ సీనియర్ హిట్టర్‌కి తాజాగా నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితోనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా ఎట్టకేలకు సర్జరీ చేయించుకున్నాడు. దాంతో కనీసం నాలుగు నుంచి ఆరు వారాలపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. రైనా మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. త్వరగా రైనా కోరుకోవాలని ఆకాంక్షించింది.

భారత్ తరఫున గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు.. ఈ ఏడాది ముగిసి ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. మూడు హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో..ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఈనెల 17 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుండగా శస్త్ర చికిత్స కారణంగా ఈ టోర్నీకి సురేశ్ రైనా దూరంగా ఉండనున్నాడు. 226 వన్డేలు ఆడిన రైరా 5,615 పరుగులు చేయగా, 78 అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు.  ఇక 18 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రైరా 768 పరుగులు సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top