నాదల్‌కు సులువే! | Rafael Nadal gets kind French Open draw | Sakshi
Sakshi News home page

నాదల్‌కు సులువే!

May 24 2014 12:22 AM | Updated on Sep 2 2017 7:45 AM

నాదల్‌కు సులువే!

నాదల్‌కు సులువే!

రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌కు సులువైన ‘డ్రా’ పడింది.

ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల
 పారిస్: రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌కు సులువైన ‘డ్రా’ పడింది. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో నాదల్‌కు గెలుపోటముల రికార్డు 59-1గా ఉంది. 2005లో తొలిసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఈ స్పెయిన్ స్టార్‌కు ఏకైక ఓటమి 2009లో నాలుగో రౌండ్‌లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో ఎదురైంది.
 
 తొలిరౌండ్‌లో ‘వైల్డ్ కార్డు’ రాబీ జినెప్రి (అమెరికా)తో ఆడనున్న డిఫెండింగ్ చాంపియన్ నాదల్‌కు అంతా అనుకున్నట్లు జరిగితే... నాలుగో రౌండ్‌లో నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్), క్వార్టర్ ఫైనల్లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), సెమీఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) లేదా ఆండీ ముర్రే (బ్రిటన్) ఎదురయ్యే అవకాశముంది. అయితే ఇటీవల జరిగిన మోంటెకార్లో, బార్సిలోనా ఓపెన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెరర్, అల్మాగ్రో చేతిలో నాదల్ ఓడిపోయాడు. కానీ గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు వస్తే మాత్రం నాదల్‌ను తక్కువ అంచనా వేయలేం. మరో పార్శ్వం నుంచి రెండో ర్యాంకర్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. తొలి రౌండ్‌లో లుకాస్ లాకో (స్లొవేకియా)తో ఫెడరర్; జోవో సాసా (పోర్చుగల్)తో జొకోవిచ్ తలపడతారు.
 
 సెరెనాకు క్లిష్టమే
 మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌లో అలీజా లిమ్ (ఫ్రాన్స్)తో ఆడనున్న సెరెనాకు మూడో రౌండ్‌లో తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా); క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మరియా షరపోవా (రష్యా) ఎదురయ్యే అవకాశముంది.
 
 సోమ్‌దేవ్ ప్రత్యర్థి నెదోవ్‌యెసోవ్
 పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో ఆడతాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నెగ్గితే రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ ఆరో సీడ్ టామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆడే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement