‘హార్దిక్‌ స్థానంతో నాకేంటి సంబంధం’

Not Here To Replace Hardik Pandya Shivam Dube - Sakshi

హైదరాబాద్‌: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆల్‌ రౌండర్‌ శివం దూబేను తనతో పోల్చవద్దని టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క బ్యాటింగ్‌ శైలి కారణంగా దూబేను  తనతో ఎందుకు పోల్చుతారంటూ యువీ అసహనం వ్యక్తం చేశాడు. ముందు అతన్ని సాఫీగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసే అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత వేరే ఒకరితో పోల్చవచ్చంటూ యువీ తెలిపాడు.

కాగా, దూబే అరంగేట్రం తర్వాత హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడా అనే వాదన కూడా వచ్చింది. దీనిపై దూబే తాజాగా మాట్లాడుతూ.. ‘ హార్దిక్‌ పాండ్యా స్థానంతో నాకేంటి సంబంధం. నేను హార్దిక్‌ స్థానాన్నిభర్తీ చేయడం కోసం ఇక్కడికి రాలేదు. నేను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమిండియా తరఫున ఆడటం లేదు. నేను కేవలం భారత క్రికెట్‌ జట్టులో సభ్యుడిని మాత్రమే. నా ప్రదర్శనతోనే నేను స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వచ్చా. నా దేశం కోసం బాగా ఆడటమే నా ముందున్న కర్తవ్యం. నా సహజ శైలిలో ఆడి నా మార్కుతోనే జట్టులో చోటు కోసం యత్నిస్తా. ఆ సత్తా నాలో ఉందనే నమ్ముతున్నా’ అని దూబే పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు ఆడనున్న  తరుణంలో దూబే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.  బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేని దూబే..  బౌలింగ్‌తో మాత్రం రాణించాడు. దాంతో దూబేను విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. మరొకవైపు హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకుని జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ తరుణంలో హార్దిక్‌ స్థానాన్ని దూబే ఎసరు పెట్టే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో దూబే స్పందించాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top