అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్‌లో నిధి చిలుముల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్‌లో నిధి చిలుముల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిధి, చైనాకు చెందిన జియావో వాంగ్‌తో కలిసి బరిలోకి దిగింది. ఈ నాలుగో సీడ్ జంట తొలి రౌండ్‌లో 6-2, 6-2 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల- రియా భాటియా (భారత్)పై విజయం సాధించింది.
మరో డబుల్స్ మ్యాచ్‌లో ఏపీకే చెందిన స్నేహ పడమట-వానియా దంగ్వాల్ (భారత్) జోడి 6-1, 6-3తో భవాని బాల కుమార్-రేష్మ గణపతి (భారత్) జంటను ఓడించి క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో మరో తెలుగమ్మాయి రిషిక సుంకర కూడా విజయాన్ని అందుకుంది. మూడో సీడ్ రిషిక 6-1, 6-2 స్కోరుతో ఆర్తి మునియన్‌పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగే సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి, ప్రాంజల తలపడనున్నారు.