న్యూజిలాండ్ వచ్చేసింది..

ross taylor

ముంబై: ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ లో పాల్గొనడానికి న్యూజిలాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టింది. మరో తొమ్మిది రోజుల్లో వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో పలువురు న్యూజిలాండ్ క్రికెటర్లు గురువారం రాత్రి ముంబైలో దిగిపోయారు. తొమ్మిది మందితో కూడిన న్యూజిలాండ్ జట్టు భారత్ కు వచ్చిన విషయాన్ని ఆ దేశ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'మళ్లీ భారత్ కు వచ్చాం. ట్రిడెంట్ హోటల్ లో దిగాం'అని టేలర్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం 9 మందితో భారత్ కు న్యూజిలాండ్ రాగా, మిగతా ఆరుగురి సభ్యుల్ని భారత్ 'ఎ' జట్టుతో ఇక్కడే పర్యటనలో ఉన్న న్యూజిలాండ్'ఎ' జట్టు నుంచి ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 'ఎ' జట్టు విశాఖపట్టణంలో భారత్ 'ఎ' జట్టుతో మ్యాచ్ లు ఆడుతోంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబైలో జరుగుతుండగా, పుణెలో రెండో వన్డే (అక్టోబర్ 25న), కాన్పూర్ లో మూడో వన్డే(అక్టోబర్ 29న) జరుగనుంది. ఆపై మూడు టీ 20ల సిరీస్ జరుగనుంది. అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో రెండు వార్మప్ మ్యాచ్ లను న్యూజిలాండ్ ఆడనుంది.
 

Back to Top