విరాట్‌ సేనకు ఘోర పరాభవం

New Zealand Beat India By 5 Wickets To Clinch Clean Sweep - Sakshi

31 ఏళ్ల తర్వాత వైట్‌వాష్‌!

మౌంట్‌మాంగనీ:  టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన న్యూజిలాండ్‌.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఈరోజు జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ 3-0తో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 297 పరుగుల టార్గెట్‌ను కివీస్‌ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్‌ ఆటగాళ్లలో మార్టిన్‌ గప్టిల్‌(66; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) నికోలస్‌(80;103 బంతుల్లో 9 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, గ్రాండ్‌ హోమ్‌(58 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి కివీస్‌కు ఘన విజయాన్ని అందించాడు.

టామ్‌ లాథమ్‌(32 నాటౌట్‌; 34 బంతుల్లో 3 ఫోర్లు) మరోసారి ఆకట్టుకుని తనవంతు పాత్రను పోషించాడు. దాంతో విరాట్‌ సేనకు ఘోర పరాభవం తప్పలేదు. కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకుందామనుకున్న టీమిండియా ఆశలు ఫలించలేదు. ఇలా టీమిండియా మూడు, అంతకంటే వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్‌ కావడం ఓవరాల్‌గా నాల్గోసారి. 1983-84 సీజన్‌లో విండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన టీమిండియా.. 1988-89లో అదే జట్టుపై మరోసారి వైట్‌వాష్‌ అయ్యింది. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొత్తం మ్యాచ్‌లు జరిగిన క్రమంలో టీమిండియా వైట్‌వాష్‌ కావడం ఇదే తొలిసారి.  2006-07 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 4-0తో సిరీస్‌ను కోల్పోయినా, ఒక వన్డే జరగలేదు. (ఇక్కడ చదవండి: సెంచరీతో రాహుల్‌ రికార్డుల మోత..!)

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (1), విరాట్‌ కోహ్లి (9) నిరాశపరిచినా..  మరో ఓపెనర్‌ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2) శ్రేయాస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్‌ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2) రాణించారు.రాహుల్‌ సెంచరీతో కదం తొక్కాడు.113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 112 పరుగులు చేశాడు. 300 పైచిలుకు పరుగులు చేస్తారనే అంచనాల నడుమ ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌లో వరుస బంతుల్లో రాహుల్‌, మనీష్‌ ఔట్‌ కావడంతో టీమిండియా ఆ మార్కు చేరుకోలేకపోయింది. బెన్నెట్‌కు నాలుగు వికెట్లు, జేమీషన్‌, నీషమ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top