
కోహ్లిని ఎగతాళి చేస్తున్న లియోన్
కోహ్లి పెవిలియన్ వెళ్తుండగా.. డిఫెన్స్ ఇలా ఆడాలంటూ లియోన్..
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా పుణ్యమా అని 250 పరుగులు చేసిన కోహ్లి సేన.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసి స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
అయితే కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేసిన అనంతరం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రవర్తించిన తీరు ఇరుజట్ల మధ్య భావోద్వేగాల స్థాయిని తెలుపుతోంది. లియోన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడేక్రమంలో కోహ్లి షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో కోహ్లి పెవిలియన్ వెళ్తుండగా.. డిఫెన్స్ ఇలా ఆడాలంటూ లియోన్ అనుకరిస్తూ చూపించాడు. ఫించ్ వికెట్ పడ్డప్పుడు కూడా విరాట్ కోహ్లి ఆనందంతో గాల్లో పంచ్‌లిస్తూ సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి టెస్టుల్లో లియోన్ బౌలింగ్‌లోనే ఆరుసార్లు ఔటవ్వడం విశేషం.