కల చెదిరింది | Narsingh Yadav banned for 4 years, Olympic dream shattered | Sakshi
Sakshi News home page

కల చెదిరింది

Aug 20 2016 2:17 AM | Updated on Sep 4 2017 9:58 AM

కల చెదిరింది

కల చెదిరింది

ఓ క్రీడాకారుడికి ఇంత కన్నా దారుణ పరిస్థితి ఏముంటుంది... అనేక అవాంతరాలను దాటుకుని ఒలింపిక్స్‌లో బరిలోకి దిగేందుకు...

నర్సింగ్‌యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధం


ఓ క్రీడాకారుడికి ఇంత కన్నా దారుణ పరిస్థితి ఏముంటుంది... అనేక అవాంతరాలను దాటుకుని  ఒలింపిక్స్‌లో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణమది.. ప్రత్యర్థి ఎవరో తేలడంతో పాటు వెయింగ్‌కు కూడా హాజరయ్యాడు.. కానీ ఇంతలోనే అతడి ఆశలను దారుణంగా చిదిమేసిన నిర్ణయం వెలువడింది. నువ్వు డోపీవే.. బౌట్‌లోకే కాదు నాలుగేళ్ల పాటు ఆటకే దూరం కావాలని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) ఇచ్చిన తీర్పుతో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ హతాశయుడయ్యాడు.  అత్యంత నాటకీయ పరిణామాలతో రియోకు చేరిన ఈ రెజ్లర్ ప్రస్థానం అదే తరహాలో ముగిసింది.


రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో బరిలోకి దిగడానికి ముందే భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు షాక్ తగిలింది. డోపింగ్ ఆరోపణలతో అతడిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తేల్చింది. ఈ కాలంలో తను ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదని కూడా స్పష్టం చేసింది. దీంతో తను గేమ్స్ నుంచి అర్ధాంతరంగా నిష్ర్కమించాల్సి వచ్చింది. అతడిపై ఎవరో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సీఏఎస్ తేల్చి చెప్పింది. అదే జరిగితే ఇప్పటిదాకా నిందితులకు ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించింది. వాస్తవానికి తను 74కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో శుక్రవారం బరిలోకి దిగాల్సి ఉంది.  అయితే సీఏఎస్ నిర్ణయంతో అంతా తలక్రిందులైంది.

 
అసలేం జరిగిందంటే..

జూన్ 25, జూలై 5న నర్సింగ్ ఇచ్చిన డోపింగ్ శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలాయి. అయితే కావాలనే ఎవరో అతడు తీసుకునే ఆహారంలో, పానీయాల్లో డ్రగ్స్ కలిపారనే కారణంతో జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఆగస్టు 2న క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే రియోకు వచ్చాక ఈ నిర్ణయాన్ని ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) సీఏఎస్ అడ్ హక్ డివిజన్‌లో అప్పీల్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున సీఏఎస్.. వాడాకు అనుకూలంగా తీర్పునివ్వడంతో నర్సింగ్‌పై వేటు పడింది.

 
‘నా భవిష్యత్‌ను చిదిమేశారు’

ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తన ఆశలను దారుణంగా చిదిమేశారని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన చెందాడు. తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని స్పష్టం చేశాడు. ‘సీఏఎస్ నిర్ణయం నా జీవితాన్ని చిద్రం చేసింది. గత రెండు నెలల నుంచి నేను పడుతున్న కష్టమంతా వృథా అయ్యింది. కానీ దేశం కోసం ఆడాలనే నా తపన మాత్రం ఎక్కడికీ పోదు’ అని నర్సింగ్ తెలిపాడు.


సీబీఐ విచారణ కోరతాం: ఐఓఏ
నర్సింగ్ యాదవ్ ఒక్క సీఏఎస్ చేతిలోనే కాకుండా ఒలింపిక్స్‌కు అతడు వెళ్లకూడదని కోరుకున్న కొందరి చేతిలోనూ ఓడిపోయాడని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ విషయాన్ని ఇంతటితో వదలబోమని, సీబీఐ విచారణ కోరతామని ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో విద్రోహ చర్య ఉందని తాము గట్టిగా వాదించలేకపోయామని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement