విండీస్‌ పర్యటనకు ధోని దూరం

MS Dhoni skips West Indies tour - Sakshi

రెండు నెలలు ప్రాదేశిక సైన్యంలో పనిచేయనున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ: ఓవైపు రిటైర్మెంట్‌పై ఎడతెగని చర్చ నడుస్తుండగా... మాజీ కెప్టెన్‌ ధోని శనివారం ఒకింత ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆగస్ట్‌లో వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి స్వయంగా తెలిపాడు. రాబోయే రెండు నెలలు తాను ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్‌ ఆర్మీ)లో పని చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టు ఎంపిక కోసం ఆదివారం ముంబైలో సెలక్టర్లు సమావేశం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధోని తన ప్రణాళిక వెల్లడించాడు. ‘మేం మూడు విషయాలు స్పష్టం చేయదల్చుకున్నాం. ధోని ఇప్పుడే క్రికెట్‌ నుంచి రిటైరవ్వట్లేదు. అతడు ముందుగా అనుకున్న ప్రకారం సైన్యంలో పని చేసేందుకు రెండు నెలలు విరామం కోరాడు. ఈ విషయాన్ని మేం కెప్టెన్‌ కోహ్లి, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు. ధోని... పదాతి దళం పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top