బ్యాటింగే కాదు కీపింగ్‌లోనూ.. ప్చ్‌! | MS Dhoni Had Poor Performance In Wicket Keeping | Sakshi
Sakshi News home page

బ్యాటింగే కాదు కీపింగ్‌లోనూ.. ప్చ్‌!

Jul 2 2019 1:13 PM | Updated on Jul 2 2019 2:16 PM

MS Dhoni Had Poor Performance  In Wicket Keeping - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఈ ప్రపంచకప్‌లో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇప్పటికే  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ధోని.. వికెట్‌ కీపింగ్‌ విషయంలోనూ అనుమానాలకు తావిస్తున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ.. అద్భుతంగా కీపింగ్‌ చేయడమే కాదు.. వికెట్లకు సంబంధించి డీఆర్‌ఎస్‌ సమీక్ష చేయడంలోనూ ఇప్పటివరకు ధోనీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే, కీలకమైన వరల్డ్‌ కప్‌లో మాత్రం ధోని వికెట్‌ కీపింగ్‌లోనే కాదు.. డీఆర్‌ఎస్‌ సమీక్షల్లోనూ అంచనాలు తప్పుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో జేసన్‌ రాయ్‌ గ్లోవ్‌ను తాకుతూ బంతి వెళ్లింది. ఐనా డీఆర్‌ఎస్‌ సమీక్ష తీసుకునే విషయంలో కోహ్లి.. ధోనిని సంప్రదించినా..  ధోని మాత్రం అందుకు విముఖత చూపాడు. అయితే, రీప్లేలో మాత్రం బంతిని జేసన్‌ రాయ్‌ గ్లోవ్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ధోని వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం మీదనే కాకుండా.. అతని నిర్ణయాలపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు స్టంపింగ్స్‌ మాత్రమే చేసిన ధోని..  ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన జాబితాలో అట్టడుగున చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకి చెందిన అలెక్స్‌ క్యారీ 18 స్టంపింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 28 పరుగులు చేసిన ధోనిపై సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా అతని ఆటతీరును విమర్శించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇన్నింగ్స్‌లో భాగంగా స్పిన్‌ బౌలింగ్‌, స్లో బాల్స్‌ను ఎదుర్కోలేక చతికిలపడిన ధోని పరోక్షంగా జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన ధోని కేవలం 188 పరుగులే చేయడం అతని బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. ఇప్పటికే 37 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోని తన ఆటతో జట్టుకు ఉపయోగపడాల్సింది పోయి భారంగా మారాడని క్రికెట్‌ ప్రేమికులు అసహనం​ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement